పడకేసిన నగర వనం
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:11 AM
మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో చేపట్టిన ‘నగర వనం’లో పలు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంతవరకు పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్టు తెలిసింది.
ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆగిన పనులు
ఏడాది క్రితం రూ.1.6 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
వీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పనులు
రూ.10 లక్షల మేర బిల్లులు అప్‌లోడ్
నిధులు విడుదల కాకపోవడంతో మిగిలిన పనులు బంద్
గొలుగొండ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో చేపట్టిన ‘నగర వనం’లో పలు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంతవరకు పూర్తి చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్టు తెలిసింది.
మండలంలోని ఎంతో ఆహ్లాదకరంగా వుండే ఆరిలోవ అటవీ ప్రాంతంలో గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు 25 ఎకరాల్లో ధన్వంతరి వనం పేరిట పలు రకాల ఔషధ మొక్కల పెంపకం చేపట్టారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేసింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ‘నగర వనం’ను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో గొలుగొండ మండలంలో మాత్రమే అటవీ ప్రాంతం వుండడంతో నగర వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరిలోవ అటవీ ప్రాంతంలో గతంలో ధన్వంతరి వనం ఏర్పాటుచేసిన ప్రదేశంలోనే నగర వనాన్ని ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా రెండు విడతల్లో సుమారు రూ.1.6 కోట్లు మంజూరు చేసింది. ఇక్కడ చిన్నారులకు ఆహ్లాదం, వినోదం, క్రీడల కోసం జలపాతం, ఈత కొలనుతోపాటు పలు పరికరాలు ఏర్పాటు చేయాలి. అడవి అందాలను వీక్షించడానికి ‘వాచ్ టవర్’ నిర్మించాలి. సందర్శకులు సేద తీరేందుకు పగోడాలు, సిమెంటు బెంచీలు, అల్పాహారం కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. ఇంకా వాకింగ్ ట్రాక్, తాగునీటి సదుపాయం కల్పించాలి. వీటిలో కొన్ని పనులు ఎనిమిది నెలల క్రితం వీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు. సుమారు రూ.10 లక్షల విలువైన పనులు పూర్తిచేసి, బిల్లులు అప్‌లోడ్ చేశారు. కానీ ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదు. దీంతో మిగిలిన పనులను నత్తనడకన సాగిస్తున్నారు. దీనిపై నర్సీపట్నం ఫారెస్ట్ సెక్షన్ రేంజర్ రాజేశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. వీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు కాలేదన్నారు.