Share News

వైజాగ్‌ స్క్వేర్‌పై నిర్లక్ష్యం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:53 AM

సిరిపురం కూడలిలో దత్‌ఐలాండ్‌ వద్ద ఏర్పాటుచేసిన ‘వైజాగ్‌ స్క్వేర్‌’ ఇప్పుడు వెలవెలబోతోంది.

వైజాగ్‌ స్క్వేర్‌పై నిర్లక్ష్యం

పైలట్‌ ప్రాజెక్టుగా సిరిపురం దత్‌ఐలాండ్‌ వద్ద జీవీఎంసీ అభివృద్ధి

పనికిరాని టైర్లు, డ్రమ్ములు, ఇతర వస్తువులు వినియోగం

రోడ్డుపై అందమైన రంగులతో ఆహ్లాదప్రాంతంగా తయారు

రూ.లక్షలు వ్యయం

నిర్వహణ లేక పాడైపోయిన వస్తువులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సిరిపురం కూడలిలో దత్‌ఐలాండ్‌ వద్ద ఏర్పాటుచేసిన ‘వైజాగ్‌ స్క్వేర్‌’ ఇప్పుడు వెలవెలబోతోంది. ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రెండు రోడ్ల మధ్యన గల ఖాళీస్థలంలో ‘వైజాగ్‌ స్క్వేర్‌’ను తీర్చిదిద్దారు. నిరుపయోగమైన టైర్లు, డ్రమ్ములు, వాహనాలను వినియోగిస్తున్నట్టు గొప్పలు చెప్పారు. తీరా వాటి నిర్వహణను విస్మరించడంతో వస్తువులన్నీ పాడైపోయి ఆ ప్రాంతం కళావిహీనంగా దర్శనమిస్తోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో సిరిపురం కూడలిలో ఉన్న దత్‌ ఐలాండ్‌ వద్ద రెండు రోడ్ల మధ్య ఖాళీగా ఉన్నచోటును వైజాగ్‌ స్క్వేర్‌ పేరుతో ప్రజలకు ఆహ్లాదం కలిగించే ప్రాంతంగా మార్చాలనుకున్నారు. రోడ్డుపై అందమైన రంగులు, రంగవల్లులు వేయించారు. ఆ ప్రాంతంలో ‘వైజాగ్‌’ అక్షరాలతో కూడిన సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటుచేశారు. నిరుపయోగంగా ఉన్న టైర్లు, ఖాళీ డ్రమ్ములు, మూలకు చేరిన స్కూటర్లు, సైకిళ్లకు రంగులు వేసి అక్కడ ఉంచారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడిపేందుకు ఇదొక ఉత్తమ వేదికగా నిలుస్తుందని అప్పటి జీవీఎంసీ అధికారులు గొప్పగా ప్రకటించారు. అయితే నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో...అది కూడా రెండు రోడ్ల మధ్య ఏర్పాటుచేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. చిన్నపిల్లలు ఆడుకుంటూ పొరపాటున రోడ్డుపైకి వెళ్లినా, ఏదైనా వాహనం అదుపుతప్పి దూసుకువచ్చినా పెనుప్రమాదానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. రూ.లక్షలు వెచ్చించి ఆర్బాటంగా వైజాగ్‌ స్క్వేర్‌ను ప్రారంభించారు. తర్వాత దీని నిర్వహణను విస్మరించడంతో అందులోని వస్తువులన్నీ పాడైపోయాయి. ఇప్పుడు వాటిని వినియోగించడానికి పనికిరాని స్థితికి చేరడంతో ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీగా ఉండే రెండు రోడ్లు మధ్య ఏర్పాటుచేసిన తుక్కువస్తువులను తొలగించడమో, లేదంటే వాటికి మరమ్మతులు చేసి తిరిగి ప్రజలు కూర్చునేందుకు అనువుగా తయారుచేయడమో చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:53 AM