Share News

ముత్యాలమ్మ జాతరపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:40 PM

స్థానిక ముత్యాలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లకు ఎమ్మెల్యే, జిల్లా అధికారులు దూరంగా ఉంటున్నారు. ప్రతి ఏడాది ఐటీడీఏ పీవో, సబ్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యే, జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించేవారు. అయితే మరో మూడు రోజుల్లో జాతర ప్రారంభం కానున్నప్పటికీ ఆ దిశగా ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. దీంతో స్థానికులు ఎమ్మెల్యే, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ముత్యాలమ్మ జాతరపై నిర్లక్ష్యం
ముత్యాలమ్మ అమ్మవారు

ఏర్పాట్లకు ఎమ్మెల్యే, అధికారులు దూరం

మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఉత్సవం

నేటికీ నిర్వహించని సమన్వయ సమావేశం

పోలీసులు తప్ప కానరాని ప్రభుత్వ శాఖలు

ఎదురీదుతున్న ఉత్సవ కమిటీ

చింతపల్లి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఏడాది గంధమావాస్యకు ముందు ముత్యాలమ్మ జాతర జరుగుతుంది. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు జాతర నిర్వహించేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. ఈ జాతరకు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు ప్రతీ ఏటా వస్తుంటారు. పూర్వం నుంచి జాతర ఎమ్మెల్యే పర్యవేక్షణలో జరుగుతుంది. ఉత్సవ కమిటీని సైతం ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్యే గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యేలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి దేముడు, పసుపులేటి బాలరాజు, గిడ్డి ఈశ్వరి, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ప్రతి ఏడాది జాతరకు నాయకత్వం వహించారు. జిల్లా అధికారులను సమన్వయం చేసుకుంటూ జాతర విజయవంతానికి కృషిచేశారు. ఈ ఏడాది ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సిఫారసు మేరకు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. ఉత్సవం విజయవంతానికి ఎమ్మెల్యే కృషి చేస్తారని స్థానికులు భావించారు. అయితే మార్చి 19న గ్రామసభ జరిగిన నాటి నుంచి నేటి వరకు ఉత్సవాల ఏర్పాటు ఏవిధంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పరిశీలించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాడేరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో చింతపల్లి గిరిజన జాతరపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మౌనంగా అధికారులు

ముత్యాలమ్మ జాతరపై పోలీసు శాఖ మినహా ఇతరశాఖల అధికారులు మౌనం వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే చొరవతో ఐటీడీఏ పీవో, సబ్‌ కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించేవారు. జాతర నాలుగు రోజులు పారిశుధ్యం మెరుగు, విద్యుత్‌ సరఫరా, రక్షిత మంచినీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించేవారు. అభివృద్ధి పనులపై స్టాల్స్‌, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవారు. అయితే జాతర నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటివరకు జిల్లా అధికారుల నుంచి మండల, డివిజన్‌ స్థాయి ఉద్యోగులకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యవేక్షణలో పోలీసులు జాతర బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎదురీదుతున్న ఉత్సవ కమిటీ

ముత్యాలమ్మ జాతర విజయవంతానికి ఉత్సవ కమిటీ ఎదురీదుతున్నది. ఎమ్మెల్యే, అధికారుల నుంచి కనీస సహకారం లేకపోయినప్పటికీ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కమిటీ ప్రయత్నాలు చేస్తున్నది. నిధులు సమీకరణ, వివిధ ఏర్పాట్లు కేవలం ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వర్తక సంఘం, గ్రామ యువత మాత్రమే నిర్వహిస్తున్నది.

Updated Date - Apr 10 , 2026 | 11:40 PM