పవిత్ర ప్రదేశంపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:23 AM
అది ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఏటా ఆషాఢ మాసం శుక్ల పక్షంలో సుభద్ర, బలభద్ర, జగన్నాథస్వామి తొమ్మిది రోజులపాటు ఇక్కడ కొలువై వుంటారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటి పడితేచాలు మందుబాబులు, గంజాయి బ్యాచ్ ఇక్కడ చేరుతున్నారు. కేకలు, అరుపులు, గొడవలతో శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యల కారణంగా చుట్టుపక్కల నివాసం వుంటున్న వారు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..
వ్యసనపరులకు నిలయంగా ఇంద్రజ్యుమ్న హాలు
రాత్రిపూట ఓపెన్ బార్‌గా వినియోగిస్తున్న మందుబాబులు
ఆకతాయిల అల్లర్లతో స్థానికుల బెంబేలు
అనకాపల్లి టౌన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): అది ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఏటా ఆషాఢ మాసం శుక్ల పక్షంలో సుభద్ర, బలభద్ర, జగన్నాథస్వామి తొమ్మిది రోజులపాటు ఇక్కడ కొలువై వుంటారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటి పడితేచాలు మందుబాబులు, గంజాయి బ్యాచ్ ఇక్కడ చేరుతున్నారు. కేకలు, అరుపులు, గొడవలతో శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యల కారణంగా చుట్టుపక్కల నివాసం వుంటున్న వారు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..
పట్టణంలోని రైల్వే గూడ్స్ షెడ్డుకు సమీపంలో ఇంద్రజ్యుమ్న హాలు (మందిరం) వుంది. ఏటా ఆషాఢ మాసంలో జగన్నాథస్వామి రథోత్సవం సందర్భంగా సుభద్ర, బలభద్ర, జగన్నాథస్వామిలను ఊరేగింపుగా ఇక్కడకు తీసుకువచ్చి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు. గతంలో ఈ మందిరానికి సమీపంలో ఒక ప్రైవేటు విద్యా సంస్థ వుండేది. ఇంద్రజ్యుమ్న హాలు ప్రాంగణాన్ని, పాఠశాల యాజమాన్యం వాహనాల పార్కింగ్ కోసం అద్దెకు తీసుకుంది. అయితే సదరు విద్యా సంస్థను వేరే చోటకు మార్చడంతో ఇంద్రజ్యుమ్న హాలు ప్రాంగణం ఖాళీగా వుంటున్నది. ఇదే అదనుగా భావించిన కొంతమంది ఆకతాలు చీకటి పడిన తరువాత ఈ ఆవరణలోకి ప్రవేశించి మద్యం, గంజాయి సేవిస్తున్నారు. కొన్నిసార్లు మందుబాబులు అరుపులు, కేకలతో పరస్పరం గొడవలకు దిగి కొట్లాడుకుంటున్నారు. దీంతో చుట్టుపక్కల నివాసం వుంటున్న వారు భయపడి ఇళ్లల్లో నుంచి బయటకు రావడంలేదు. పోలీసులు స్పందించి, ఇంద్రజ్యుమ్న హాలు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రాంగణంలోకి మందుబాబులు, ఆకతాయిలు రాకుండా కట్టడి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.