21న నీట్
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:56 AM
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ స్థాయి ప్రవేశాలకు నిర్వహించే నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఈనెల 21వ తేదీన నగరంలోని 18 కేంద్రాల్లో జరగనున్నది. ఈ ఏడాది మే మూడో తేదీన నీట్ నిర్వహించడం జరిగింది.
జిల్లాలో 8,112 మంది అభ్యర్థులు
18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
ప్రతిచోట పోలీస్ బందోబస్తు
ఏఐ ఆధారిత సాంకేతికతతో
సీసీ కెమెరాలు
నోడల్ అధికారిగా కలెక్టర్
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ స్థాయి ప్రవేశాలకు నిర్వహించే నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఈనెల 21వ తేదీన నగరంలోని 18 కేంద్రాల్లో జరగనున్నది. ఈ ఏడాది మే మూడో తేదీన నీట్ నిర్వహించడం జరిగింది. ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసి తిరిగి ఈనెల 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఒక పర్యాయం ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. పరీక్షకు జిల్లా కలెక్టర్‌ను కేంద్రం నోడల్ అధికారిగా నియమించింది. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో మెజిస్టీరియల్ అధికారి, బందోబస్తుకు పోలీసులు, కస్టోడియన్‌గా బ్యాంకు అధికారి ఉంటారు. ఏఐ ఆధారిత టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలను అన్ని కేంద్రాల్లో ఏర్పాటుచేస్తున్నారు. ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు తరలింపు, పరీక్ష అనంతరం జవాబుపత్రాల బండిల్స్ సా్ట్రంగ్‌రూమ్‌కు తరలింపు అంతా జీపీఎస్ ట్రాకింగ్ పర్యవేక్షణలో జరగనున్నది. ఒక కేంద్రంలో 480 మంది అభ్యర్థుల వరకు ఆరుగురు, అంతకంటే ఎక్కువ మంది ఉంటే పది మంది పోలీసులను తనిఖీల కోసం నియమిస్తున్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేశారు. గతంలో ప్రభుత్వ మహిళా కళాశాల పరీక్ష కేంద్రంగా ఉండేది. దానికి బదులుగా ఇప్పుడు కొమ్మాదిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటుచేస్తున్నారు. జిల్లాలో 18 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు 8,112 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అత్యధికంగా ఏయూ ఆర్ట్స్ కళాశాలలో 600 మంది పరీక్ష రాయనున్నారు. వాల్తేర్ కేంద్రీయ విద్యాలయం (అక్కయ్యపాలెంలోని ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్ వెనుక)లో 552 మంది, కృష్ణా కళాశాల, మల్కాపురం, ఎన్‌ఎడీ, గాంధీగ్రామ్‌లోని నౌసేనాబాగ్-1, 2, మర్రిపాలెంలో కేంద్రీయ విద్యాలయం, కొమ్మాదిలోని నవోదయ విద్యాలయం, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ బిల్డింగ్, ఇంజనీరింగ్ కళాశాలల న్యూక్లాస్‌రూమ్ కాంప్లెక్స్‌లో 480 మంది వంతున, గంభీరంలోని ఐఐఎంలో 408 మంది పరీక్ష రాస్తున్నారు. మర్రిపాలెంలోని స్కోడా కార్ల షోరూమ్ ఎదురుగా గల శ్రీవిజయనగర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో 384 మంది, కంచరపాలెంలోని ప్రభుత్వ పాలటెక్నిక్, కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల, ఏయూ ఇంటర్ నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 360 మంది వంతున, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 288 మంది పరీక్ష రాయనున్నారు. ఉక్కునగరం, వాల్తేరు కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు వంశీకృష్ణ, కమలదీప్‌లను సిటీ కో-ఆర్డినేటర్లుగా నియమించారు.