Share News

నీట్‌ ప్రశాంతం

ABN , Publish Date - May 04 , 2026 | 01:04 AM

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో (బ్యాచిలర్స్‌ డిగ్రీ) ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

నీట్‌ ప్రశాంతం

హాజరైన 7,987 మంది విద్యార్థులు

98.46 శాతం నమోదు

జిల్లాలో 18 కేంద్రాల్లో పరీక్ష

విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో (బ్యాచిలర్స్‌ డిగ్రీ) ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 8,112 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 98.46 శాతంతో 7,987 మంది విద్యార్థులు హాజరయ్యారు. 125 మంది గైర్హాజరయ్యారు. పది కేంద్రాలకు స్టీల్‌ప్లాంటు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ ఈవీఎల్‌ఎన్‌ వంశీకృష్ణ, మరో ఎనిమిది సెంటర్లకు వాల్తేరు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ కమల్‌జిల్‌ కో-ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. జిల్లా యంత్రాంగం పరీక్షల నిర్వహణను పర్యవేక్షించింది.

మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పరీక్షకు ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. కొన్నిచోట్ల పరీక్ష కేంద్రానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులను పోలీసులు, స్థానిక జర్నలిస్టులు స్పందించి ఆయా కేంద్రాలకు చేర్చారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రం వద్ద భారీసంఖ్యలో విద్యార్థులు బారులుతీరారు. కొందరు విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా చెవి దిద్దులు, ఇతర వస్తువులు ధరించి రావడంతో అక్కడి సిబ్బంది వారించి ఆయా వస్తువులు తీసిన తరువాతే కేంద్రాల్లోకి అనుమతించారు.

Updated Date - May 04 , 2026 | 01:04 AM