జనాభా గణనలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:34 PM
భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. జనాభా గణనపై అధికారులకు మూడు రోజులు నిర్వహించే శిక్షణను కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. భారత జనాభా గణన- 2027 త్వరలో ప్రారంభమవుతుందని, కచ్చితమైన సమాచారం సేకరణకు కృషి చేయాలని, అలాగే పౌరులు సైతం పక్కా సమాచారాన్ని మాత్రమే తెలపాలన్నారు. కచ్చితమైన గణాంకాలే దేశాభివృద్ధికి పునాదులని, సర్వేలో సేకరించిన ప్రతి డేటా అత్యంత కచ్చితంగా ఉండాలన్నారు. ప్రజలు అందించే సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, వనరుల కేటాయింపు వంటివి జరుగుతాయన్నారు. ఈ క్రమంలో తప్పులు దొర్లేందుకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. జనాభా గణన ప్రక్రియలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవాంతరాలను అధిగమించి సమాచార సేకరణ చేపట్టాలని సూచించారు. ఈసారి జనాభా గణనలో భాగంగా రెండు విడతలుగా జరుగుతుందన్నారు. మొదటి దశ గృహాల గణన ఈ ఏడాది ఏప్రిల్‌లో, రెండో దశ 2027 ఫిబ్రవరి నెలలో మొదలవుతుందన్నారు. భారత జనాభా గణన- 2027పై అధికారులు, సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించేందుకు మూడు రోజులు శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, కలెక్టర్ పరిపాలనాధికారి ప్రసాదరావు, ఎన్నికల మాస్టర్ ట్రైనర్లు డాక్టర్ వై.జగన్నాథం, త్రినాథరావు, అనిల్‌కుమార్, శివరామ్‌కుమార్, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.