నిఘా నీడలో నీట్
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:14 AM
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం జాతీయస్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది.
ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
91.05 శాతం మంది విద్యార్థుల హాజరు
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
అభ్యర్థులను తనిఖీ చేసిన బౌన్సర్లు
ఉదయం 11 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతి
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, జేసీ
విశాఖపట్నం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి):
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం జాతీయస్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. గత నెల మూడోతేదీన నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో రద్దుచేయగా, ఆదివారం నాటి పరీక్షకు ఎలాంటి అవాంతరాలు, అవకతవకలు ఎదురవకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
జిల్లాలోని మొత్తం 18 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. మెజిస్టీరియల్ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. ప్రశ్న పత్రాలను జీపీఎస్ సదుపాయం ఉన్న వాహనాల్లో కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. గతంలో అభ్యర్థులను పోలీసులు తనిఖీ చేసేవారు. కానీ ఈ సారి పోలీసులు బందోబస్తు నిర్వహించగా, అభ్యర్థులను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. బాలికలను తనిఖీ చేయడానికి మహిళా బౌన్సర్ల సేవలు వినియోగించారు. పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికల జడలు విప్పి, జుత్తు విరబూసుకుని లోపలకి వెళ్లాలని సూచించారు. జడకు ఉండే క్లిప్పులు కూడా తొలగించారు. చెవి దుద్దులు, మెడలో గొలుసులు, చేతి గాజులు తీసివేసిన తరువాతే కేంద్రాల్లోకి అనుమతించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే వాటర్‌బాటిల్‌ను అభ్యర్థులు కేంద్రాల్లోకి తీసుకురావచ్చునని ఎన్‌టీఏ సూచించింది. అయితే ఏయూలోని మూడు కేంద్రాల్లో ఒక చోట పోలీసులు వాటిని కూడా అనుమతించలేదు.
అభ్యర్థులకు తోడుగా తల్లిదండ్రులు, బంధువులు ఉదయం పదిగంటలకే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. చిరుజల్లులు కురవడం, ఆకాశం మేఘావృతంగా ఉండడంతో ఇబ్బందులు ఎదురుకాలేదు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత కేంద్రాల గేట్లు మూసివేశారు. దాదాపుగా అభ్యర్థులంతా నిర్ణీత సమయానికే కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఏయూ, కేంద్రీయ విద్యాలయం-2 కేంద్రాలను తనిఖీచేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. మొత్తం 18 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 8,105 మంది హాజరుకావాల్సి ఉండగా 7,298 మంది (91.05 శాతం) హాజరయ్యారు. వీరిలో బాలురు 1,761 మందికి 1,619, బాలికలు 6,254 మందికిగాను 5,679 మంది హాజరయ్యారు. బాలురు 141 మంది, బాలికలు 576 మంది మొత్తం 717 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. సహకరించిన అన్నిశాఖల అధికారులు, సిబ్బంది, కేంద్రాల నిర్వాహకులను అభినందించారు.