Share News

జిల్లాకు ఎన్‌సీసీ బెటాలియన్‌!

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:23 PM

జిల్లాలో నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌(ఎస్‌సీసీ) బెటాలియన్‌ ఏర్పాటుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్లుగా విశాఖపట్నం జిల్లాలో ఉండే గిరిజన ప్రాంతం నాలుగేళ్ల క్రితం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు కావడంతో ఇక్కడ ఎన్‌సీసీ బెటాలియన్‌ ఏర్పాటు అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు.

జిల్లాకు ఎన్‌సీసీ బెటాలియన్‌!
అరకులోయలో మే నెలలో జరిగిన ఎన్‌ సీసీ రాష్ట్ర స్థాయి ట్రెక్కింగ్‌లో పాల్గొన్న క్యాడెట్‌లు

పాడేరు కేంద్రంగా ఏర్పాటుకు జిల్లా అధికారుల ప్రతిపాదనలు

బెటాలియన్‌ ఏర్పాటుతో విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, దేశ భక్తి, ఉద్యోగ అవకాశాలు

గిరిజన ప్రాంత విద్యార్థి, యువత వికాసానికి దోహదం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌(ఎస్‌సీసీ) బెటాలియన్‌ ఏర్పాటుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్లుగా విశాఖపట్నం జిల్లాలో ఉండే గిరిజన ప్రాంతం నాలుగేళ్ల క్రితం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు కావడంతో ఇక్కడ ఎన్‌సీసీ బెటాలియన్‌ ఏర్పాటు అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా పాడేరు కేంద్రంగా ఎన్‌సీసీ బెటాలియన్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు సమర్పించారు.

ఏజెన్సీలో 175 వరకు ఉన్నత పాఠశాలలు, 19 జూనియర్‌, 5 డిగ్రీ కళాశాలలున్నాయి. వాటిలో సుమారుగా 63 వేల మంది గిరిజన విద్యార్థులున్నారు. ఈ క్రమంలో వారికి ఎన్‌సీసీ శిక్షణలు అందించడం ద్వారా దేశ నిర్మాణానికి బలమైన పునాదులు పడడంతో పాటు క్రమశిక్షణ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బాటలు వేసినట్టు ఉంటుందని జిల్లా అధికారులు భావించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 20న అమరావతిలో జరిగిన విద్యాశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ వద్ద జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ స్వామినాయుడు ప్రస్తావించారు. అలాగే గిరిజన ప్రాంతంలో విద్యార్థులు, యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు, వారికి కేంద్ర పారామిలటరీ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఎన్‌సీసీ బెటాలియన్‌ ఏర్పాటు అవసరమని ఆయన వివరించారు. అందుకు గాను మంత్రి లోకేశ్‌ సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ, దానిపై ఏపీ 13, ఎన్‌సీసీ బెటాలియన్‌ అధికారులతో చర్చించి, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన జిల్లా అధికారులు అందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించారు.

గిరిజన ప్రాంతానికి దూరంగా ఎస్‌సీసీ సేవలు

ఎక్కడైనా ఎస్‌సీసీ బెటాలియన్‌ ఉంటే, దానికి 50 కిలోమీటర్ల పరిధిలో అవసరమైన శిక్షణలు, సేవలు అందిస్తారు. అయితే ఏజెన్సీ ప్రాంతం విశాఖపట్నం, విజయనగరంలోని ఎన్‌సీసీ బెటాలియన్‌లకు 100 కిలోమీటర్లు పైబడి దూరంలో ఉండడంతో గిరిజన ప్రాంతానికి ఎన్‌సీసీ సేవలు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏజెన్సీలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఎన్‌సీసీ శిక్షణలు పొందే అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి విద్యార్థులకు ఎన్‌సీసీ శిక్షణలు అందించడం ద్వారా వారికిలో క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం, దేశభక్తి పెంపొందించడంతో పాటు ఎన్‌సీసీ సర్టిఫికెట్‌లతో వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎన్‌సీసీ పూర్తి చేసిన వారికి ఏ, బీ, సీ సర్టిఫికెట్‌లను జారీ చేస్తారు. ఏ సర్టిఫికెట్‌ పొందిన వారికి పాలిటెక్నిక్‌ కళాశాల్లో ప్రవేశాలు కోటా కల్పిస్తారు. అలాగే బీ సర్టిఫికెట్‌ ఉంటే ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, నీట్‌, ఐఐటీల్లో సైతం సీట్లు పొంది ప్రవేశాలు పొందుతారు. అలాగే ఇక సీ సర్టిఫికెట్‌లు పొందిన విద్యార్థులకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే పీజీలో ప్రవేశాలు, కేంద్ర పారామిలటరీ బలగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశఽం ఉంది. వాస్తవానికి గిరిజనుల్లో అవగాహన లేకపోవడంతో పారా మిలటరీ విభాగాల్లో వారికి కేటాయించిన ఎస్‌టీ కోటా పోస్టులు భర్తీకాకుండా పోతున్నాయి. అదే ఎన్‌సీసీ వంటి శిక్షణలు పొందిన వారుంటే వారికే ఆయా ఉద్యోగాలు పొందే అవకాశం దక్కుతుందని అధికారులు అంటున్నారు. కాగా గిరిజన ప్రాంతంలో గంజాయి, మాదకద్రవ్యాలు వంటి వాటి వల్ల విద్యార్థులు, యువత చెడు మార్గాల్లో పయనిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్‌సీసీ బెటాలియన్‌ ఏర్పాటు ఎంతో అవసరమని ప్రభుత్వం సైతం భావిస్తున్నది. దీంతో త్వరలోనే పాడేరు కేంద్రంగా ఎన్‌సీసీ బెటాలియన్‌ ఏర్పాటుకు మార్గం సుగమవుతుందని జిల్లా అధికారులు అంటున్నారు. అలాగే గిరిజన ప్రాంతానికి ఎన్‌ సీసీని పరిచయం చేయాలనే లక్ష్యంతో గత మే నెల 24 నుంచి 31 వరకు అరకులోయ పరిసరాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్‌లతో ట్రెక్కింగ్‌ క్యాంప్‌ను నిర్వహించారు.

Updated Date - Jun 04 , 2026 | 11:23 PM