Share News

నేవీ రిహార్సల్స్‌ అదుర్స్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:31 AM

అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్‌ ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఇవి అరగంటపాటు కొనసాగాయి. తొలుత హెలికాప్టర్లు జాతీయ పతాకాన్ని, నౌకాదళం పతకాలను రెపరెపలాడిస్తూ ముందుకుసాగాయి. ఆ తరువాత చేతక్‌ హెలికాప్టర్లు, వాటి వెనుక జెట్‌ స్పీడ్‌తో మిగ్‌ 29కే యుద్ధ విమానాలు దూసుకువెళ్లాయి.

నేవీ రిహార్సల్స్‌ అదుర్స్‌

ఐఎఫ్‌ఆర్‌ వేడుకల్లో భాగంగా పూర్తిస్థాయిలో ప్రాక్టీస్‌

పాలుపంచుకున్న చేతక్‌ హెలికాప్టర్లు,

మిగ్‌ 29కే యుద్ధ విమానాలు, కమోవ్‌ హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్స్‌

నడిసముద్రంలో శత్రు స్థావరం పేల్చివేత

విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్‌ ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఇవి అరగంటపాటు కొనసాగాయి. తొలుత హెలికాప్టర్లు జాతీయ పతాకాన్ని, నౌకాదళం పతకాలను రెపరెపలాడిస్తూ ముందుకుసాగాయి. ఆ తరువాత చేతక్‌ హెలికాప్టర్లు, వాటి వెనుక జెట్‌ స్పీడ్‌తో మిగ్‌ 29కే యుద్ధ విమానాలు దూసుకువెళ్లాయి. అనంతరం డార్నియర్‌, మిగ్‌ కే యుద్ధ విమానాలు, నిఘా విమానం పీ8ఐ, కమోవ్‌ హెలికాప్టర్లు, ఐదు ఫైటర్‌ జెట్స్‌ వరుసగా కనువిందు చేశాయి. అనంతరం తీరంలో యుద్ధ ట్యాంకులు శత్రుమూకలపై దాడి చేసే విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. ఆ తరువాత ఆరు చేతక్‌ హెలికాప్టర్లు, రెండు ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్లు ఒకేచోట ఉండగా కమోండోలు వాటి నుంచి తాళ్ల సాయంతో సముద్రంలోని బోటులోకి దిగి శత్రు స్థావరాలను పేల్చి వేసి, తిరిగి పైకి చేరుకున్న తీరు సందర్శకులను ఆశ్చర్యచకితులను చేసింది. అనంతరం వివిధ దేశాలకు చెందిన నేవీ సిబ్బంది, ఎన్‌సీసీ విద్యార్థులు, ఇతర విభాగాలకు చెందినవారు సిటీ పరేడ్‌ రిహార్సల్‌లో పాల్గొన్నారు.

లేజర్‌ షో మెరుపులు

విన్యాసాల ముగింపు అనంతరం ప్రత్యేకంగా నిర్వహించిన లేజర్‌ షో అదుర్స్‌ అనిపించింది. సముద్రంలో ఉన్న ఒక షిప్‌ పైనుంచి ప్రత్యేకంగా ఈ షోను నిర్వహించారు. సుమారు 15 నిమిషాలపాటు సాగిన లేజర్‌ షోతో తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. అనంతరం నిర్వహించిన డ్రోన్‌ షో కూడా ఆకట్టుకుంది. పదికిపైగా డ్రోన్లతో షో నిర్వహించారు. ఆ తరువాత బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. మొత్తంగా మంగళవారం నిర్వహించిన విన్యాసాలు, లేజర్‌, డ్రోన్‌ షోలు ఫైర్‌ వర్క్స్‌ నగరవాసులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

డ్రోన్‌లపై ఆంక్షలు

ఐఎన్‌ఎస్‌డేగా నుంచి

పార్క్‌ హోటల్‌ వరకూ వినియోగం నిషేధం

20వ తేదీ వరకూ అమలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):

నగరం వేదికగా ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకూ డ్రోన్‌ల వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు. ప్రముఖులు దిగే ఐఎన్‌ఎస్‌ డేగాతోపాటు అక్కడి నుంచి బీచ్‌రోడ్డులో కార్యక్రమాలు జరిగే పార్క్‌ హోటల్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని టెంపరరీ రెడ్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌ కెమెరాలు వినియోగించకూడదని స్పష్టంచేశారు. ఎవరైనా వినియోగిస్తే క్రిమినల్‌ కేసులకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఐఎఫ్‌ఆర్‌కు 150 స్పెషల్‌ బస్సులు

మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9.00 గంటల వరకూ...

ద్వారకా బస్‌స్టేషన్‌,

ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):

రామకృష్ణా బీచ్‌ కేంద్రంగా బుధవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకూ ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), మిలాన్‌, సిటీ పరేడ్‌ జరగనున్నందున జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 ప్రత్యేక సర్వీసులు నడపనున్నామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు ప్రకటించారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలను అనుసరించి ఈ సర్వీసులు ఆపరేట్‌ చేయనున్నామని వెల్లడించారు. మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9.00 గంటల వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతామని తెలిపారు. కొత్తవలస, సింహాచలం, పెందుర్తి, పాతగాజువాక, సింథియా, అగనంపూడి, తగరపువలస, తదితర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌, వుడా పార్కు వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 01:31 AM