సాగరతీరంలో సందడి
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:46 AM
వైమానిక దళం సాహస విన్యాసాలతో అదరహో అనిపించింది.
పూర్తిస్థాయిలో నేవీ రిహార్సల్స్
అబ్బురపరచిన విన్యాసాలు
బీచ్‌రోడ్డులో విదేశీ సేనల కవాతు
నేడు రాష్ట్రపతి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాక
సీఎం చంద్రబాబునాయుడు రాక రేపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
వైమానిక దళం సాహస విన్యాసాలతో అదరహో అనిపించింది. విదేశీ సేనల కవాతుతో సాగర తీరం సరికొత్త కళ సంతరించుకుంది. నేవీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆర్‌కే బీచ్‌లో పూర్తి రిహార్సల్స్‌ను నిర్వహించింది. తొలుత భారత నౌకాదళానికి చెందిన వైమానిక విభాగం తన అమ్ములపొదిలోని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వంతుల వారీగా గగనతలంలో మెరిపించి మురిపించింది. ఆ తరువాత శత్రుసేనలపై దాడికి దిగితే ఎలా ఉంటుందో చేతల్లో చూపించింది. జెమినీ బోట్లపై శత్రుమూకలపైకి వెళ్లడం, ఆపదలో ఉన్నవారిని హెలికాప్టర్లలో వెళ్లి రక్షించడం వంటివన్నీ కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఆఖరున ఆహ్వానిత దేశాల ప్రతినిధులు వారి వారి సంస్కృతీ సంప్రదాయాలతో కవాతు చేస్తూ బీచ్ రోడ్డులో ‘పరేడ్’ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం కూడా మరోసారి పూర్తిస్థాయి ప్రాక్టీస్ చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రముఖుల రాక
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) నేపథ్యంలో నగరానికి పలువురు ప్రముఖులు రానున్నారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు నగరానికి వస్తున్నారు. రాష్ట్రపతి మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు చేరుకుంటారు. అక్కడ ఆమెకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, నేవీ అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆమె సేవల్ బేస్‌కు చేరుకుని విందులో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం నేవల్ బేస్‌కు చేరుకుని మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళతారు.
రేపు రానున్న సీఎం
ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 18న నగరానికి రానున్నారు. ఉదయం 8 గంటలకు విజయవాడలో బయలుదేరి 9.20 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ జెట్టీకి వెళ్లి భారత రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ఆమెతో పాటు ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళతారు.
నేడు పవన్‌కల్యాణ్ రాక
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఐఎఫ్‌ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. సాయంత్రం ఐఎన్‌ఎస్ డేగా వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన అనంతరం నగరంలో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు తూర్పు నౌకదళ కేంద్రానికి చేరుకుని ఐఎఫ్‌ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఐఎన్‌ఎస్ డేగా వద్ద రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు.
మంత్రి రాక..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మంగళ, బుధవారాల్లో నగరంలో పర్యటించనున్నారు. ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనేందుకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. 18వ తేదీ రాత్రి 11.20 గంటలకు విశాఖ నుంచి రైలులో విజయవాడ వెళతారు.
ఐఎఫ్‌ఆర్ సేవల్లో ఫిషింగ్ బోట్లు
విదేశీ ప్రతినిధుల తరలింపునకు 100 బోట్లు
సముద్రంలో నిలిపిన నౌకల్లో చెత్తను తెచ్చేందుకు మరో 20
సముద్రంలో పహారాకు మరో రెండు...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భారత నౌకాదళం అట్టహాసంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు మత్స్యకారులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ నెల 18న జరిగే ఐఎఫ్‌ఆర్ కోసం 70కి పైగా దేశాల నుంచి నేవీ, కోస్టుగార్డు ప్రతినిధులు వారి నౌకల్లో విశాఖపట్నం వచ్చారు. వారంతా 19న ఆర్‌కే బీచ్‌లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో పాల్గొని కవాతు చేస్తారు. అదేవిధంగా డాక్‌యార్డులో ఏర్పాటు చేసిన మిలాన్ విలేజ్‌ను సందర్శిస్తారు. నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూస్తారు. వీరిని సముద్రంలో నౌకల నుంచి తీరానికి సురక్షింగా తీసుకువచ్చి, అవసరమైనప్పుడు మళ్లీ వారిని సముద్రంలో నౌకల వద్ద దిగబెట్టే బాధ్యతలను మత్స్యకారులకు అప్పగించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 100 ఫిషింగ్ బోట్లను అద్దెకు తీసుకొని వాటిని అందంగా తీర్చిదిద్దారు. విశాఖలో ఉన్నవాటితోపాటు కాకినాడ నుంచి కొన్ని బోట్లను తీసుకువచ్చి ఈ విధులకు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా సముద్రంలో నిలిపిన విదేశీ నౌకల్లో రోజు వారీ వచ్చే చెత్తను తీరానికి తీసుకువచ్చి డంపింగ్ చేసేందుకు మరో 20 బోట్లను ఏర్పాటు చేశారు. ఈ 120 బోట్లను ఫిషింగ్ హార్బర్‌లో నిలిపేందుకు వీలుగా 11వ నంబరు జెట్టీని ఖాళీ చేసి ఇచ్చామని మత్స్య శాఖ జాయింట్ డైరక్టర్ లక్ష్మణరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇవన్నీ 24/7 సేవలు అందిస్తున్నాయన్నారు. అదే విధంగా ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు సముద్రంలో నేవీ నౌకలు విన్యాసాలు చేయనున్నందున తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ముందుగానే సమావేశాలు పెట్టి హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా అలా వెళితే వెంటనే గుర్తించి, వెనక్కి తీసుకువచ్చేందుకు మరో రెండు మెకనైజ్డ్ బోట్లను పెట్రోలింగ్‌కు ఉపయోగిస్తున్నామని లక్ష్మణరావు తెలిపారు.