Share News

నేవీ ఫైనల్‌ రిహార్సల్స్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:21 AM

అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లో భాగంగా ఆర్కే బీచ్‌లో బుధవారం సాయంత్రం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్‌ అబ్బురపరిచాయి.

నేవీ ఫైనల్‌ రిహార్సల్స్‌

భారీగా తరలివచ్చిన సందర్శకులు

కిక్కిరిసిన ఆర్‌కే బీచ్‌ రోడ్డు

ప్రత్యేక ఆకర్షణగా సిటీ పరేడ్‌ సన్నాహక ప్రదర్శన

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):

అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లో భాగంగా ఆర్కే బీచ్‌లో బుధవారం సాయంత్రం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్‌ అబ్బురపరిచాయి. నేవీ శక్తి, సామర్థ్యాలను తెలియజేస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. విన్యాసాలను తిలకించేందుకు నగరవాసులు, నేవీ, ఇతర శాఖల అధికారులు, వారి కుటుంబసభ్యులు భారీసంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన విన్యాసాలు అరగంట పాటు కొనసాగాయి.

బాంబుల మోతతో దద్దరిల్లిన తీరం

నేవీకి చెందిన చేతక్‌, కమోవ్‌, సీకింగ్‌ 42 హెలికాప్టర్లు, మిగ్‌ 29కే, డార్నియర్‌ యుద్ధవిమానాలు, నిఘా విమానం పీ8ఐ చేసిన ప్రదర్శనలు అలరించాయి. ముఖ్యంగా మిగ్‌ 29కే, డార్నియర్‌ యుద్ధ విమానాలు భారీ శబ్దంతో చేసిన దాడులు అదుర్స్‌ అనిపించాయి. అనంతరం ఐదు ఫైటర్‌ జెట్స్‌ అమితవేగంతో దూసుకువెళ్లిన తీరు సందర్శకులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. యుద్ధ ట్యాంకులు, నాలుగు బీఎన్‌పీ ఫైటింగ్‌ హెలికాప్టర్ల విన్యా సాలు కట్టిపడేశాయి. రెండు ఏఎల్‌హెచ్‌, ఆరు చేతక్‌ హెలికాప్టర్లతో సముద్రంలో కమెండోలు చేసిన సాహస విన్యాసాలు, ఆయిల్‌ రిగ్‌ను ధ్వంసం చేసిన తీరు నేవీశక్తి, సామర్థ్యాలను చాటిచెప్పాయి. ఆ తరువాత సుమారు గంటపాటు నిర్వహించిన సిటీ పరేడ్‌ రిహార్సల్‌ విశేషంగా ఆకట్టుకుంది. భారత్‌తోపాటు వివిధ దేశాల నేవీ సిబ్బంది, బ్యాండు పార్టీలు పరేడ్‌లో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన కళాకారుల బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించాయి. భారత నేవీ అధికారులు ప్రత్యేకంగా నిర్వహించిన కంటిన్యుటీ డ్రిల్స్‌ కట్టిపడేశాయి. ఇందులో భాగంగా తుపాకులతో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. అనంతరం నౌకల పైనుంచి లేజర్‌ షో, తీరంలో పైర్క్‌ వర్క్స్‌తో సాగరం సరికొత్త హంగులను అద్దుకుంది. వీటిని వీడియోలు తీసేందుకు సందర్శకులు ఆసక్తి చూపించారు.


పోలీస్‌ వలయంలో నగరం

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం

బీచ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు

ముమ్మరంగా సాగుతున్న వాహన తనిఖీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్నేషల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌ నేపథ్యంలో నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. బీచ్‌రోడ్డు పరిసర ప్రాంతాలతో పాటు తీరానికి చేరుకునే మార్గాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌ కోసం రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో పాటు ప్రపంచదేశాల నౌకాదళ ఉన్నతాధికారులు నగరానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 5,750 మందితో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సిరిపురం కూడలి, సర్క్యూట్‌హౌస్‌, సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి జంక్షన్‌, ఆంథోనీ నగర్‌ జంక్షన్‌, జగదాంబ జంక్షన్‌లలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. పార్క్‌హోటల్‌ జంక్షన్‌, కురుపాం టవర్స్‌ జంక్షన్‌, ఆల్‌ఇండియా రేడియో జంక్షన్‌, పందిమెట్ట ప్రాంతాల్లో పోలీసు పికెట్‌లు ఏర్పాటుచేశారు. బీచ్‌రోడ్డు వైపు వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. వాటిని ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్రముఖులు బసచేసిన హోటళ్లు, ప్రయాణించే మార్గాలతోపాటు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్‌రోడ్డు పరిసరాలు పోలీసులతో నిండిపోయాయి. గురువారం సాయంత్రం బీచ్‌రోడ్డులో జరిగే కార్యక్రమాలను వీక్షించేందుకు హాజరయ్యే సందర్శకుల వాహనాలను ఏపీఐఐసీ మైదానం, ఏయూ జిమ్నాజియం గ్రౌండ్‌ వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అక్కడ ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సిబ్బందిని నియమించారు.

Updated Date - Feb 19 , 2026 | 01:21 AM