Share News

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:57 PM

అల్లూరి జిల్లాలో జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి జి.భానుమూర్తిరాజు తెలిపారు.

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
కుమ్మరిపుట్టు గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిషాంతి

7 పరీక్ష కేంద్రాల్లో నిర్వహణ

82 శాతం విద్యార్థులు హాజరు

కుమ్మరిపుట్టులో కలెక్టర్‌ నిషాంతి తనిఖీ

పాడేరురూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి జిల్లాలో జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి జి.భానుమూర్తిరాజు తెలిపారు. శనివారం పాడేరు కుమ్మరిపుట్టులోని గిరిజన గురుకుల బాలికల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విశాఖపట్నం కొమ్మాదిలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి జిల్లాలో 7 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,443 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా.. పరీక్షకు 1,190 మంది హాజరై 82 శాతం హాజరు నమోదయ్యిందని డీఈవో భానుమూర్తిరాజు తెలిపారు. ఎంఈవోలు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లుగా వ్యవహరించి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారన్నారు. జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.శశికుమార్‌ చింతపల్లి మండలంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:57 PM