ఉక్కుకు నేచురల్ గ్యాస్
ABN , Publish Date - May 02 , 2026 | 01:11 AM
స్టీల్ ప్లాంటు ఎదుర్కొంటున్న గ్యాస్ సమస్య పరిష్కారానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకువచ్చింది.
కొరత సమస్య పరిష్కారానికి ముందుకువచ్చిన ఐవోసీ
రోజుకు 18 వేల క్యూబిక్ మీటర్ల పీఎన్‌జీ సరఫరా
మెడ్‌టెక్ జోన్ నుంచి పైప్‌లైన్ ఏర్పాటు పనులు ప్రారంభం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటు ఎదుర్కొంటున్న గ్యాస్ సమస్య పరిష్కారానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకువచ్చింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌కు బదులుగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) అందిస్తామని ఆఫర్ చేసింది. అందుకు స్టీల్ యాజమాన్యం అంగీకరించడంతో పైపులైన్ పనులు ప్రారంభించింది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మళ్లీ గ్యాస్ కొరత ఎదుర్కొంటోంది. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం నేపథ్యంలో ఇండస్ట్రియల్ ఎల్‌పీజీ సరఫరాను తగ్గించడంతో మార్చి నెల మధ్యలో సంక్షోభం ఎదుర్కొంది. అనేక విజ్ఞప్తుల తరువాత ఐండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా 18 టన్నుల గ్యాస్ ట్యాంకర్లను దఫదఫాలుగా సరఫరా చేయడంతో కొంత పరిస్థితి మెరుగుపడింది. అయితే స్టీల్ ప్లాంటు సొంతంగా తయారు చేసుకునే కోక్‌ఓవెన్ల గ్యాస్ ఉత్పత్తి ఇప్పుడు బాగా పడిపోయింది. ప్లాంటులో వివిధ విభాగాల్లో వచ్చే వృథా వాయువులను ఉపయోగించుకుని స్టీల్ ఉత్పత్తి చేసేలా యాజమాన్యం ఏర్పాట్లు చేసుకుంది. ప్లాంటుకు ఐదు కోక్‌ఓవెన్ బ్యాటరీలు ఉండగా, వాటి ద్వారా వచ్చే వృథా వాయువులతో స్టీల్ మెల్టింగ్ షాపులో బ్లూమ్స్‌ను వైర్ రాడ్స్‌గా కట్ చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇటీవల 1, 2 బ్యాటరీలలో ఓవెన్లు అత్యధిక శాతం మూలకు చేరాయి. పనిచేయడం లేదు. ఐదో బ్యాటరీలో ఓవెన్లు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. దీంతో వృథా వాయువులు బాగా తగ్గిపోయాయి. ఎల్‌పీజీ సరఫరా కూడా రెగ్యులర్‌గా ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంపై కర్మాగారం దృష్టిసారించింది. ఐఓసీతో చర్చించింది.
అగనంపూడి ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో ఐఓసీకి పైప్డ్ నేచురల్ గ్యాస్ స్టోరేజీ సెంటర్ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు పీఎన్‌జీ సరఫరా బాధ్యత ఐఓసీనే తీసుకుంది. గాజువాకలో అనేక ప్రాంతాల్లో గృహ వినియోగానికి పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చింది. పీఎన్‌జీని ఉపయోగించుకోవడానికి అభ్యంతరం లేకపోతే సరఫరా చేస్తామని ఐఓసీ అధికారులు చెప్పగా, స్టీల్ అధికారులు అంగీకరించారు. రోజుకు 18 వేల క్యూబిక్ మీటర్ల పీఎన్‌జీ అవసరమని లెక్క తేల్చారు. దీనికి మెడ్‌టెక్ జోన్ నుంచి స్టీల్ ప్లాంటులో గ్యాస్ ప్లాంటు వరకు ఆరు కిలోమీటర్ల పొడవున పైపులైన్ వేయాలని నిర్ణయించి, పనులు కూడా ప్రారంభించారు. ఒక నెల రోజుల్లో పీఎన్‌జీ సరఫరా మొదలవుతుందని, ఇక గ్యాస్‌కు ఇబ్బందులు ఉండవని, వ్యయం కూడా కొంతవరకు తగ్గుతుందని స్టీల్ ప్లాంటు అధికార వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి.