జాతీయ వీల్‌చైర్ క్రికెట్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:59 AM
మండలంలోని గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ ఎరీనా క్రికెట్ గ్రౌండ్‌లో 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభం అయ్యాయి.
సబ్బవరం, ఫిబ్రవరి 23 : మండలంలోని గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ ఎరీనా క్రికెట్ గ్రౌండ్‌లో 5వ జాతీయ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభం అయ్యాయి. 26వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలను ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబీ,్జ ఏపీ వీల్ చైర్ క్రికెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొంటున్న ఆంధ్ర తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ జట్లను పరిచయం చేసుకున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగులు క్రికెట్ కమిటీ, ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అవెన్యూ స్పోర్ట్స్ ఎరీనా సీఈవో ఎం.వెంకటరమణ, శ్రీకాకుళం వీల్ చైర్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు కొట్టిన కిరణ్, ఉపాధ్యక్షుడు జీపీ నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
మొదటి మ్యాచ్‌లో ఏపీ విజేత
జాతీయ దివ్యాంగుల వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో ఏపీ జట్టు విజేతగా నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన తెలంగాణ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఛేదనలో ఏపీ జట్టు 16.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్‌గా అప్పలరాజు నిలిచాడు. మరో మ్యాచ్‌లో ఒడిశాపై ఛత్తీస్‌గఢ్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఒడిశా అత్యంత ఘోరంగా 9.3 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఛత్తీస్‌గఢ్ జట్టు 1.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్‌గా కిశోర్ నిలిచారు.