సకాలంలో జాతీయ రహదారి పనుల పూర్తి
ABN , Publish Date - May 07 , 2026 | 12:09 AM
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516-ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు జేసీ శ్రీపూజ ఆదేశం
పాడేరు, మే 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516-ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ ఆదేశించారు. హైవే పనుల ప్రగతిపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ రహదారి పనులను మరింత వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో నెలకొనే సమస్యలను అధిగమించాలన్నారు. పెండింగ్ పరిహారాల చెల్లింపులు సకాలంలో జరిగేలా చూడడంతో పాటు రోడ్డు నిర్మాణంలో అటవీ అనుమతులకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. అధికారులు, ఇంజనీర్లు క్షేత్ర పర్యటనలు చేపట్టి సకాలంలో రోడ్డు నిర్మాణ పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని, నాణ్యతగా నిర్మాణ పనులు జరగాలన్నారు. అలాగే హైవేలో పలు మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, జనం ఉండే ప్రదేశాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, నేషనల్ హైవే అథారిటీ అఽధికారులు, ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.