వాకరోడ్డు కుదింపు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:26 AM
మండలంలోని రామన్నపాలెం సెంటర్ నుంచి ఎరకన్నపాలెం మీదుగా జాతీయ రహదారిపై ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వరకు నిర్మించాల్సిన వాక రోడ్డును అధికారులు కుదించారు. భూ సమస్య కారణంగా ఎరకన్నపాలెం నుంచి పెద్దపల్లి వరకే నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
ఎరకన్నపాలెం నుంచి పెదపల్లి వరకు..
భూ సమస్యతో అధికారుల నిర్ణయం
15 కి.మీ.ల నుంచి 10 కి.మీ.లకు తగ్గింపు
మాకవరపాలెం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రామన్నపాలెం సెంటర్ నుంచి ఎరకన్నపాలెం మీదుగా జాతీయ రహదారిపై ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వరకు నిర్మించాల్సిన వాక రోడ్డును అధికారులు కుదించారు. భూ సమస్య కారణంగా ఎరకన్నపాలెం నుంచి పెద్దపల్లి వరకే నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
మాకవరపాలెం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రవాణా సౌలభ్యం కోసం జాతీయ రహదారిని అనుసంధానం చేయడానికి రామన్నపాలెం సెంటర్ నుంచి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి అధికారులు గతంలో ప్రతిపాదనలు తయారు చేశారు. వాస్తవంగా ఎరకన్నపాలెం నుంచి పెదపల్లి వరకు రెవెన్యూ/ అటవీ భూముల్లో కాలిబాట (వాక రోడ్డు) వుంది. దీనిని వంద అడుగులకు విస్తరించడానికి ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. మధ్యలో కొంతమేర అటవీ ప్రాంతం వుండడంతో పర్యావరణ పరంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి రావడంతో ప్రభుత్వంతో మాట్లాడి, రోడ్డు నిర్మాణానికి అటవీ భూమి ఎంత అవసరం వుంటుందో.. అంతే భూమిని వేరేచోట రెవెన్యూ శాఖ ద్వారా అటవీ శాఖకు బదలాయించేలా కృషి చేశారు. ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. అయితే రామన్నపాలెం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు పయనీర్ కంపెనీకి చెందడం, ఇదే స్థలంలో రైల్వే ట్రాక్ నిర్మాణం జరగనుండడంతో కొత్త సమస్య వచ్చింది. దీంతో ఎరకన్నపాలెం నుంచి పెదపల్లి వరకు 10 కిలోమీటర్లు మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. అటవీ శాఖ పరిధిలో వున్న వాకరోడ్డు ప్రాంతం నాలుగు కిలోమీటర్ల మేర 40 అడుగులు, మిగిలిన ఆరు కిలోమీటర్లు 100 అడుగుల మేర రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.