Share News

నారాయణ... నారాయణ!

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:54 AM

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగులేటి నారాయణ తీరు జిల్లా ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు.

నారాయణ... నారాయణ!

జిల్లా ఎమ్మెల్యేలకు మునిసిపల్‌ మంత్రి పర్యటన సమాచారం కరువు

వియ్యంకుడి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలో సమీక్ష

అక్కడికే ఉన్నతాధికారులను పిలిపించుకున్న వైనం

విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగులేటి నారాయణ తీరు జిల్లా ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు. ఆయన మంగళవారం విశాఖపట్నం వస్తున్నారనే సమాచారం జిల్లాలో ఎమ్మెల్యేలలో చాలామందికి తెలియదు. అంతా రాష్ట్రపతి పర్యటన, మంత్రి లోకేశ్‌కు వీడ్కోలు పలికే పనిలో ఉన్నారు. సాయంత్రం నగరానికి వచ్చిన మంత్రి నారాయణ తన వియ్యకుండైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. మధురవాడ జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడికే జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌భరత్‌లను పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో తిరిగి అభివృద్ధి పనులపై ఆదేశాలు ఇచ్చారు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు కినుక వహించారు. మంత్రి వస్తే వీఎంఆర్‌డీఏలోనో, జీవీఎంసీ కార్యాలయంలోనో సమీక్షా సమావేశం నిర్వహించాలి కానీ జోనల్‌ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆయన పర్యటన విషయం తమకు తెలియలేదని, జిల్లా అధికారులు కూడా చెప్పలేదని వాపోయారు. నగరంలో సమావేశం నిర్వహించి ఉంటే అన్ని నియోజకవర్గాల సమస్యలు చెప్పుకునే వారమని, ఆ అవకాశం లేకుండా చేశారని వాపోయారు. ఈసారైనా మంత్రి నారాయణ వారికి ఆ అవకాశం ఇస్తారో...లేదో మరి.

నిర్మాణ్‌, పీఎంఎస్‌ యాప్‌ల ఆవిష్కరణ

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) డిజిటలైజేషన్‌లో భాగంగా రెండు యాప్‌లను తయారుచేయగా వాటిని పురపాలక శాఖా మంత్రి నారాయణ మంగళవారం రాత్రి మధురావాడ జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పారదర్శకత కోసం నిర్మాణ్‌ యాప్‌, లేఅవుట్ల వ్యవస్థలో సమర్థవంతమైన కార్యకలాపాల కోసం పీఎంఎస్‌ యాప్‌లను రూపొందించినట్టు కమిషనర్‌ తేజ్‌ భరత్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రపతి రాకకు కొద్దిగా ముందు యువకుడి హల్‌చల్‌

మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించి మానసిక వైద్యశాలకు తరలించిన పోలీసులు

మహారాణిపేట, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

నగర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతిని కలుస్తానంటూ మంగళవారం ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. అతడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాన్వాయ్‌ ఆర్కే బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకోవడానికి పది నిమిషాల ముందు ఒక యువకుడు హల్‌చల్‌ చేస్తూ రోడ్డుమీదకు వచ్చాడు. తాను రాష్ట్రపతి కలవాలంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని మహారాణిపేట స్టేషన్‌కు తరలించారు. అతను మధురవాడకు చెందిన భార్గవకుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడి ఆరోగ్య పరిస్థితి బాగుండడం లేదని తల్లి చెప్పడం, స్టేషన్‌లో కూడా విచిత్రంగా ప్రవర్తించడంతో మానసిక వైద్యశాలలో చేర్పించారు.


కనకమహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన

మహారాణిపేట, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి):

శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఖడ్గమాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు, ఉభయదాతలు విచ్చేసి అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - Jul 01 , 2026 | 12:54 AM