నాణ్యతకు తూట్లు
ABN , Publish Date - May 13 , 2026 | 01:04 AM
మండలంలోని చోడవరం- గవరవరం రహదారిని రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి కనీసం నెల రోజులు కాకముందు నాణ్యతాలోపాటు బయటపడుతున్నాయి. కొన్నిచోట్ల అంచులు జారిపోతుండగా, మరికొన్నిచోట్ల చిన్నపాటి గోతులు ఏర్పడుతున్నాయి.
చోడవరం- గవరవరం రోడ్డు పనుల్లో బయటపడుతున్న లోపాలు
రూ.2.5 కోట్లతో నెల రోజుల క్రితం పూర్తి
అప్పుడే పలుచోట్ల కుంగిన అంచులు, రహదారిపై చిన్నపాటి గోతులు
చోడవరం, మే 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చోడవరం- గవరవరం రహదారిని రెండున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి కనీసం నెల రోజులు కాకముందు నాణ్యతాలోపాటు బయటపడుతున్నాయి. కొన్నిచోట్ల అంచులు జారిపోతుండగా, మరికొన్నిచోట్ల చిన్నపాటి గోతులు ఏర్పడుతున్నాయి.
చోడవరం- గవరవరం రహదారి మీదుగా చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. చాలా ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోకపోవడంతో అడుగడుగునా గోతులు ఏర్పడి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ రోడ్డు అభివృద్ధికి రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ద్వారా పని దక్కించుకున్న కాంట్రాక్టర్.. సుమారు నెల రోజుల క్రితం పూర్తిచేశారు. ప్రయాణం సాఫీగా సాగిపోతుందని ఆయా గ్రామాల ప్రజలు సంతోషించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలిచేలా లేదు. పలుచోట్ల రహదారి పనుల్లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మారుతీనగర్- గవరవరం మధ్యలో తారురోడ్డు అంచులు జారిపోవడంతోపాటు, రోడ్డుపై చిన్న పాటి గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాలు పడితే ఈ గోతుల్లో నీరు చేరి, వాహనాల రాకపోకల సమయంలో టైర్ల ఒత్తిడితో పెద్ద గోతులుగా మారి, రహదారి ఛిద్రం అవుతుంది. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తుంది. రోడ్డు నిర్మాణ సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడం, లేదంటే కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు కావడంతో నెల రోజుల్లోనే నాణ్యతాలోపాలు బయటపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒక పర్యాయం ఈ రహదారిని పరిశీలించి, నాణ్యతాలోపాలతో పనులు చేసిన/ చేయించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.