Share News

త్రిశూలం చెంతనే నందీశ్వరుడు

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:21 AM

కైలాసగిరికి కొత్త శోభ చేకూరింది. ఇటీవల పరమ శివుడి త్రిశూలాన్ని, ఢమరుకాన్ని ఏర్పాటుచేసిన విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు, ఇప్పుడు అక్కడ నందీశ్వరుడిని కూడా జోడించారు.

త్రిశూలం చెంతనే నందీశ్వరుడు

కైలాసగిరికి కొత్త శోభ

విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):

కైలాసగిరికి కొత్త శోభ చేకూరింది. ఇటీవల పరమ శివుడి త్రిశూలాన్ని, ఢమరుకాన్ని ఏర్పాటుచేసిన విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు, ఇప్పుడు అక్కడ నందీశ్వరుడిని కూడా జోడించారు. త్రిశూలం ఏర్పాటుచేసిన ప్రాంతంలోనే నందీశ్వరుడిని కూడా కొలువుదీర్చారు. దీనిని ఫైబర్‌ రీఎన్‌ఫోర్స్‌ ప్లాస్టిక్‌తో తయారుచేయించారు. తొమ్మిది అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ నందీశ్వరుడిని నగరానికి చెందిన రమణమూర్తి అనే శిల్పి తయారుచేశారని వీఎంఆర్‌డీఏ అధికారులు తెలిపారు. దీనికి రవాణా ఖర్చులతో కలిపి సుమారు ఆరు లక్షల రూపాయల వ్యయం అయింది. ఈ విగ్రహాన్ని ఇటీవల రెండు రోజులు ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. అది ముగిసిన వెంటనే సోమవారం కైలాసగిరిపైకి తీసుకువచ్చారు. దీంతో కైలాసగిరికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరిందని వీఎంఆర్‌డీఏ డీఎఫ్‌ఓ రమణమూర్తి, ఎఫ్‌ఆర్‌ఓ శిరీష తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 01:21 AM