Share News

ఎలమంచిలి వైస్‌చైర్మన్‌గా నానాజీ

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:15 AM

ఎలమంచిలి మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవంగా సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక.. కోరం లేకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. వైస్‌చైర్మన్‌ ఎన్నిక కోసం మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో ప్రిసైడింగ్‌ అధికారి అయిన అడ్డ్డరోడ్డు ఆర్డీవో వెంకట రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఎలమంచిలి వైస్‌చైర్మన్‌గా నానాజీ
మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌గా గెలుపొందిన గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ)కి ధ్రువీకరణపత్రం అందజేస్తున్న ప్రిసైడింగ్‌ అధికారి వెంకట రామలక్ష్మి

ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి కౌన్సిలర్లు

పొత్తు ధర్మం పాటించినట్టు ఎమ్మెల్యే సుందరపు వెల్లడి

ఎలమంచిలి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవంగా సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక.. కోరం లేకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. వైస్‌చైర్మన్‌ ఎన్నిక కోసం మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో ప్రిసైడింగ్‌ అధికారి అయిన అడ్డ్డరోడ్డు ఆర్డీవో వెంకట రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 32 వార్డుల కౌన్సిలర్లుతోపాటు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, చైర్‌పర్సన్‌ రమాకుమారి హాజరయ్యారు. సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాని జనసేన పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లతో ప్రిసైడింగ్‌ అధికారి వెంకట రామలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక చేపట్టారు. 30వ వార్డు నుంచి టీడీపీ తరపున గెలుపొందిన గొర్లె నానాజీ పేరును 21వ వార్డు కౌన్సిలర్‌ కొత్తలంక రాజేశ్‌ (టీడీపీ) ప్రతిపాదించగా, 13వ వార్డు కౌన్సిలర్‌ సీరా సాయి ప్రసన్న (బీజేపీ) బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ సూచించడంతో జనసేన కౌన్సిలర్లు కూడా బలపరిచారు. దీంతో గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించి, ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. నూతన వైస్‌చైర్మన్‌ నానాజీని ఎమ్మెల్యే విజయకుమార్‌, చైర్‌పర్సన్‌ రమాకుమారి, కౌన్సిలర్లు అభినందించారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత కౌన్సిల్‌ హాలులోకి వచ్చిన వైసీపీ కౌన్సిలర్లతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణస్వీకారం చేయించారు. కాగా వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, చైర్‌పర్సన్‌ రమాకుమారి పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు.

జనసేన కార్యాలయం నుంచి రాక

అంతకుముందు మంగళవారం ఉదయం టీడీపీ, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో రైల్వేస్టేషన్‌ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపటికి జనసేన కౌన్సిలర్లు కూడా రావడంతో ఎమ్యెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ అందరితో సమావేశం నిర్వహించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, టీడీపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు కె.అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, వైస్‌చైర్మన్‌ ఎన్నిక విషయంలో కూటమి పొత్తు ధర్మం మేరకు, తమ పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రకటించారు. అనంతరం అంతా కలిసి మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లారు.

Updated Date - Nov 25 , 2026 | 01:15 AM