Share News

పంచాయతీ పోరుకు నగారా

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:50 PM

గ్రామ పంచాయతీలకు సంబంధించి తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసింది.

పంచాయతీ పోరుకు నగారా
చింతపల్లి మండలం తాజంగి పంచాయతీ కార్యాలయం

తొలి విడతలో 66 పంచాయతీలకు ఎన్నికలు

నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ

15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

26న 66 పంచాయతీలు, 686 వార్డులకు ఎన్నికలు

ఏకగ్రీవాల పంచాయతీల పారితోషకాలు భారీగా పెంపు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీలకు సంబంధించి తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసింది. జిల్లాలో మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఈనెల 26, రెండో విడత 29, మూడో విడత డిసెంబరు 2న నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. అయితే తొలి విడతగా జిల్లాలోని చింతపల్లి మండలంలో 17 పంచాయతీలు, 204 వార్డులు, జీకేవీధిలో 16 పంచాయతీలు, 188 వార్డులు, కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలు, 294 వార్డులు.. మొత్తంగా 66 పంచాయతీలు, 686 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇందుకుగానూ చింతపల్లిలో 9, జీకేవీధిలో 8, కొయ్యూరులో 13 నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఏక గ్రీవ పంచాయతీలకు పారితోషికాలు భారీగా పెంపు

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ తోపాటు వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమైతే ప్రభుత్వం అందించే పారితోషికాలను ఈసారి భారీగా పెంచింది. ఈ మేరకు శుక్రవారం జీవో (నెం:1111)ను జారీ చేసింది. గతంలో 2 వేలు లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2 వేలు నుంచి 5 వేలు లోపు జనాభా ఉంటే రూ.10 లక్షలు, 5 వేలు నుంచి 10 వేలు లోపు జనాభాకు రూ.15 లక్షలు, 10 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు చొప్పున పారితోషికాలను అందించేవారు. వాటిని తాజాగా భారీగా పెంచారు. 2 వేలు నుంచి 5 జనాభా ఉన్న పంచాయతీకి రూ.15 లక్షలు, 5 వేలు నుంచి 10 వేలు జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు పారితోషికంగా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. గ్రామ స్థాయిలో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాటి పారితోషికాలను భారీగా పెంచింది.

తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌

-మొదటి విడతలో.... చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 66 పంచాయతీలు, 686 వార్డులకు ఎన్నికలు

-ఈనెల 13న ఎన్నికల నోటిఫికేషన్‌,

-15 నుంచి 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

-18న నామినేషన్ల పరిశీలన,

-19న అభ్యంతరాల స్వీకరణ, 20న వాటి పరిష్కారం

- 21న నామినేషన్ల ఉపసంహరణ,

-26న ఎన్నికలు, ఓట్ల లెక్కించి, ఫలితాల ప్రకటన

-అవసరాన్ని బట్టి ఈనెల 27న రీపోలింగ్‌ నిర్వహణ

Updated Date - Nov 13 , 2026 | 10:50 PM