జడ్పీ పీఠంపై నాగమణి
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:07 AM
అనకాపల్లి జిల్లా పరిషత్ తొలి పాలకవర్గం కొలువుదీరింది. జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి ఇప్పటికే కైవసం చేసుకోవడంతో శుక్రవారం చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక లాంఛనంగా జరిగింది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ శుక్రవారం ఇక్కడి జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా జనసేన పార్టీకి చెందిన పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి, వైస్ చైర్‌పర్సన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతిలను జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జనసేనకు చెందిన పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు ఎన్నిక
వైస్‌చైర్‌పర్సన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మునగపాక
జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి...
ఎన్నికల ప్రక్రియ చేపట్టిన కలెక్టర్ విజయకృష్ణన్
జడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం
కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం
అనకాపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా పరిషత్ తొలి పాలకవర్గం కొలువుదీరింది. జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కూటమి ఇప్పటికే కైవసం చేసుకోవడంతో శుక్రవారం చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక లాంఛనంగా జరిగింది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ శుక్రవారం ఇక్కడి జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా జనసేన పార్టీకి చెందిన పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి, వైస్ చైర్‌పర్సన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతిలను జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు జడ్పీటీసీ సభ్యులతో అక్షరక్రమంలో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్ ఎన్నిక చేపట్టగా, పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి పేరును నర్సీపట్నం జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ (టీడీపీ) ప్రతిపాదించగా, కశింకోట జడ్పీటీసీ సభ్యురాలు పొన్నగంటి నాగమణి (బీజేపీ) బలపరిచారు. ఇతర సభ్యులంతా చేతులెత్తి ఆమోదం తెలపడంతో మోటూరు నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ ప్రకటించారు. తరువాత వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టగా, మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి (టీడీపీ) పేరును అనకాపల్లి జడ్పీటీసీ సభ్యుడు (టీడీపీ) పల్లెల నాగేశ్వరరావు ప్రతిపాదించగా, బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యురాలు పోతల భవానీ (జనసేన) బలపరిచారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడంతో పెంటకోట స్వాతి ఎన్నికైనట్టు కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 24 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికైన సభ్యులందరూ సమావేశానికి హాజరై ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. చైర్పర్సన్, చైర్పర్సన్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు హాజరై నూతన చైౖర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తోపాటు జడ్పీటీసీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.సత్యనారాయణ, జడ్పీ సీఈఓ సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సందడిగా జడ్పీ ప్రాంగంణం
జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం ఎన్నికలు, ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అనకాపల్లిలోని జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా జడ్పీటీసీ సభ్యులతోపాటు వివిధ మండలాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన జడ్పీటీసీ సభ్యులను వారి అనుచరులు, అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
తొలి అడుగులోనే ఉన్నత పదవి
నాగమణిని వరించిన అదృష్టం
సొంతూరు ధర్మారాయుడుపేటలో పండుగ వాతావరణం
పరవాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో రావాడ పంచాయతీ ధర్మారాయుడుపేటకు చెందిన మోటూరు నాగమణి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే విజయం సాధించడం.. పిమ్మట జిల్లాస్థాయి ఉన్నత పదవిని చేపట్టడం గొప్ప విషయమని మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరవాడ మండలం నుంచి జడ్పీ పీఠాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డుల్లో నిలిచిపోతారని అంటున్నారు. నాగమణి పదో తరగతి వరకు చదువుకున్నారు. మోటూరు సన్యాసినాయుడుతో 2000 సంవత్సరంలో వివాహమైంది. పల్లవి, విజయదుర్గ కుమార్తెలు ఉన్నారు. సన్యాసినాయుడు 2006లో టీడీపీ తరపున రావాడ ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. 2007 నుంచి 2011 వరకు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో టీడీపీ, జనసేన మద్దతుతో రావాడ సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాదించారు. ప్రస్తుతం జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ జిల్లా సభ్యుడుగా వున్నారు.
జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యం
జడ్పీ నూతనచైర్పర్సన్ మోటూరు నాగమణి
తుమ్మపాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాను సమగ్రంగా అభివృద్ధే చేయడమే తనప్రధాన లక్ష్యమని, మారుమూల గ్రామాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని జడ్పీ నూతన చైర్పర్సన్ మోటూరు నాగమణి పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కూటమి పెద్దలు అప్పగించిన ఈ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తానన్నారు. ప్రజాప్రతినిధులను, అధికారులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని వివరించారు. అనకాపల్లి జిల్లాకు తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా వుందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.