విద్యార్థి మృతిపై వీడిన మిస్టరీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:51 AM
మండలంలోని ఏటికొప్పాకకు చెందిన బాలుడు ఆడారి కౌశిక్ మృతిపై మిస్టరీ వీడింది. స్నేహితుడి ఇంట్లో వున్న నాటు తుపాకీని పరిశీలిస్తుండగా, పొరపాటున పేలడంతో కౌశిక్ ఎడమ చేతి భుజం కింద నుంచి తూటా దూసుకుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.
నాటుతుపాకీ పేలడంతో ప్రాణాలు కోల్పోయిన బాలుడు
అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
ఎలమంచిలి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏటికొప్పాకకు చెందిన బాలుడు ఆడారి కౌశిక్ మృతిపై మిస్టరీ వీడింది. స్నేహితుడి ఇంట్లో వున్న నాటు తుపాకీని పరిశీలిస్తుండగా, పొరపాటున పేలడంతో కౌశిక్ ఎడమ చేతి భుజం కింద నుంచి తూటా దూసుకుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు పోస్టుమార్టం నివేదిక వచ్చినట్టు సీఐ ధనుంజయరావు సోమవారం వెల్లడించారు. నాటు తుపాకీని కలిగి వున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
కాకినాడ జిల్లా తుని పట్టణంలోని గవరపేటకు చెందిన ఆడారి కౌశిక్ (12) తండ్రి కొంతకాలం క్రితం మృతిచెందడంతో ఏటికొప్పాకలో పెదనాన్న బొడ్డేడ బాబ్జీతోపాటు మేనమామ వద్ద ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8వ తేదీ ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో మొత్తం ఎనిమిది మంది స్నేహితులు కలిసి మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఆటలాడుకోవడానికి సమీపంలోని వరహా నది ఆనకట్ట వద్దకు వెళ్లారు. వీరిలో ఒక బాలుడి ఇల్లు అక్కడకు చేరువలో కొండవాలు ప్రదేశంలో వుంది. తమ ఇంట్లో తుపాకీ వుందని, దానిని చూపిస్తానని చెప్పడంతో అందరూ కలిసి అతని ఇంటికి వెళ్లారు. నాటు తుపాకీని తీసి పరిశీలిస్తుండగా.. పొరపాటున ట్రిగ్గర్ నొక్కుకుపోవడం, బుల్లెట్ బయటకు వచ్చి కౌశిక్ ఎడమ భుజం కింద నుంచి దూసుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో తీవ్రరక్తస్రావమై మృతిచెందాడు. తోటి విద్యార్థులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీసుకుంటూ వెళ్లిపోయారు. రక్తపు మడుగులో ఉన్న బాలుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి, ఏటికొప్పాక వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చి, వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. కానీ అక్కడ బాలుడి మృతదేహం కనిపించలేదు. ఈలోగా సీఐ ధనుంజయరావు, రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర, పోలీసు సిబ్బంది వచ్చారు అంతాకలిసి చుట్టుపక్కల గాలించారు. సుమారు గంటన్నర తరువాత సమీపంలోని తుప్పల్లో బాలుడి మృతదేహం కనిపించింది. కానీ నాటు తుపాకీ పేలడం వల్లనే మృతిచెందినట్టు పోలీసులు నిర్ధారించలేదు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పలు ఆధారాలు సేకరించారు. కొండపై ఉన్న పాకల్లో ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చి, అక్కడ నివాసం ఉంటున్న వారి వివరాలను రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కౌశిక్‌తోపాటు వెళ్లిన స్నేహితులతో మాట్లాడి పలు వివరాలు రాబట్టారు. వీరిలో ఒకరు నాటు తుపాకీ కలిగి వున్న వ్యక్తి కుమారుడని నిర్ధారణ అయ్యింది. అనంతరం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసు విషయమై సీఐ ధనుంజయరావుకు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్ చేసి అడగ్గా.. పోస్టుమార్టం ప్రాథమిక సమాచారం మేరకు నాటు తుపాకీ పేలడంతో కౌశిక్ మృతిచెందినట్టు తేలిందని చెప్పారు.