Share News

వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:32 PM

మండలంలోని హట్టగుడ గ్రామ సమీపాన ఉన్న రూపా రిసార్ట్స్‌ వద్ద ఈ నెల 24న జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ మైనర్లు కావడంతో జువెనైల్‌ హోమ్‌కు తరలించామని పాడేరు డీఎస్పీ అభిషేక్‌ తెలిపారు.

వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
వివరాలు వెల్లడిస్తున్న పాడేరు డీఎస్పీ అభిషేక్‌, పక్కన అరకు సీఐ, ఎస్‌ఐ

ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని జువెనైల్‌ హోమ్‌కు తరలింపు

అరకులోయ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హట్టగుడ గ్రామ సమీపాన ఉన్న రూపా రిసార్ట్స్‌ వద్ద ఈ నెల 24న జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ మైనర్లు కావడంతో జువెనైల్‌ హోమ్‌కు తరలించామని పాడేరు డీఎస్పీ అభిషేక్‌ తెలిపారు. ఆదివారం అరకులోయ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్నివలస గ్రామానికి చెందిన నాగెళ్ల సురేశ్‌(25) గతంలో అరకులోయలోని ఒక రిసార్టులో అకౌంటెంట్‌గా పని చేశాడు. ఆ సమయంలో అదే రిసార్టులో పని చేస్తున్న స్వీపర్‌తో పరిచయం ఏర్పడింది. అతను ఆ తరువాత ఉద్యోగం వదిలి స్వగ్రామం వెళ్లి వివాహం చేసుకుని హైదరాబాద్‌లో ఒక జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 24న గతంలో రిసార్టులో పని చేసిన మహిళతో కలిసి అరకులోయకు సమీపంలోని లోతేరు రోడ్డులో హట్టగుడ గ్రామం వద్ద ఉన్న రూపా రిసార్టులో దిగాడు. వారిద్దరూ గదిలో ఉండగా ఆ రిసార్టులో పని చేసే ముగ్గురు రూమ్‌బాయ్స్‌ (మైనర్లు) ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలో తలుపులు కొట్టారు. ఆ మహిళను తమకు అప్పగించమని సురేశ్‌ను బెదిరించారు. వీరి గొడవ భరించలేక సురేశ్‌ రూమ్‌ ఖాళీ చేసి మహిళతో పాటు రిసార్టు బయటకు వస్తుండగా ఆ ముగ్గురూ అడ్డగించారు. కత్తులతో బెదిరించారు. అయినా వెళ్లిపోతుండడంతో సురేశ్‌ను కత్తులతో పొడిచి హెల్మెట్‌తో తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో సురేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత సురేశ్‌తో వచ్చిన మహిళను ఆ ముగ్గురూ బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆ సమయంలో ఆ దారిలో కొందరు రావడంతో ఆమెను విడిచిపెట్టి పారిపోయారు. సమాచారం అందడంతో ఈ నెల 25వ తేదీ వేకువజామున అరకులోయ ఎస్‌ఐ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. రిసార్టులోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ఆ ముగ్గురు మైనర్లు ఈ ఘాతుకానికి బడిగట్టినట్టు నిర్ధారించుకున్నారు. వారిని శనివారం అదుపులోకి తీసుకుని విశాఖ జువెనైల్‌ హోమ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. మైనర్లను పనిలో పెట్టుకున్న రిసార్టు యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఇకపై తరచూ రిసార్టులు, లాడ్జీలను తనిఖీ చేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో అరకు సీఐ హిమగిరి, ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:32 PM