Share News

నేటి నుంచి ముత్యాలమ్మ జాతర

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:32 AM

మన్యం ప్రజల ఆరాధ్యదైవం చింతపల్లి ముత్యాలమ్మ జాతర మంగళవారం ప్రారంభంకానున్నది. ఈ నెల 17వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేటి నుంచి ముత్యాలమ్మ జాతర
ముత్యాలమ్మ ఆలయం

నాలుగు రోజుల పాటు నిర్వహణ

విస్తృతంగా ఏర్పాట్లు

చింతపల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి):

మన్యం ప్రజల ఆరాధ్యదైవం చింతపల్లి ముత్యాలమ్మ జాతర మంగళవారం ప్రారంభంకానున్నది. ఈ నెల 17వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 110 ఏళ్లకు పైగా స్థానికులు అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఉత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారి ఆలయంలో సాధారణ పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం అమ్మవారి గరగలు(పాదాలు) సుర్లవారి వంశీయుల స్థావరాల నుంచి శతకంపట్టు వద్దకు తీసుకొస్తారు. అమ్మవారి గరగలకు శతకంపట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గురువారం సాయంత్రం చింతపల్లి పురవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం సుర్లవారి స్థావరాలకు అమ్మవారి పాదాలను తరలించనున్నారు. శుక్రవారం అనుపోత్సవం నిర్వహిస్తారు. సుర్లవారి స్థావరంలో అమ్మవారి గరగలను(పాదాలు) అర్చకులు దూప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు శిరస్సుపై అమ్మవారి పాదాలు మోసుకుని ఆలయానికి తీసుకురావడంతో సంబరం ముగుస్తుంది. కాగా అమ్మవారి జాతరను పురస్కరించుకుని చింతపల్లిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌, సాయిబాబా దేవాలయం నుంచి సంతబయలు వరకు సుమారు 2.5 కిలోమీటర్ల ప్రధాన రహదారిని విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రధాన కేంద్రాల్లో విద్యుత్‌ సెట్టింగులు వేశారు. అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

మూడు వేదికల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ ఏడాది ఉత్సవ కమిటీ ప్రతినిధులు మూడు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు ఏర్పాటు చేశారు. స్టేజి-1 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, స్టేజి-2 సబ్‌జైల్‌, స్టేజి-3 ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేశారు. సినీ డూప్స్‌, డ్యాన్స్‌ మస్తీ, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, బుల్లితెర నటులతో హాస్య ప్రదర్శన, నాటకాలు, బుర్రకథలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పసుపులేటి వినాయకరావు, ప్రధాన కార్యదర్శి పోతురాజు బాలయ్య తెలిపారు. భక్తులకు సహాయం చేసేందుకు 60 మంది వలంటీర్లను నియమించామన్నారు. జిల్లా అధికారులు, పోలీసుశాఖ సహకారంతో ఆలయం ప్రాంగణంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని వారు తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 12:32 AM