Share News

ముసురు

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:16 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా ఏజెన్సీలో ముసురు కొనసాగుతున్నది.

ముసురు
అరకులోయలో ముసురుతో గొడుగులు వేసుకొని వచ్చిన ప్రజలు.

రోజంతా జల్లులు, మోస్తరు వర్షం

జన జీవనానికి అంతరాయం

ఖరీఫ్‌కు అనుకూలమని రైతుల ఆనందం

పాడేరు/హుకుంపేట/అరకులోయ/కొయ్యూరు/చింతపల్లి/జీకేవీధి/ముంచంగిపుట్టు/సీలేరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా ఏజెన్సీలో ముసురు కొనసాగుతున్నది. శుక్రవారం జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లోనూ జల్లులు, ఒక మోస్తరు వర్షం కురుస్తున్నది. ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో మోస్తరు వర్షంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. అయితే ఈ వర్షాలు ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు ఎంతో మేలు చేస్తాయని రైతులు భావిస్తున్నారు. ఎండ లేని కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టాయి. దీంతో శుక్రవారం కొయ్యూరులో 28.9 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 26.0, చింతపల్లిలో 23.9, పెదబయలులో 23.6, ముంచంగిపుట్టులో 22.8 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హుకుంపేటలో శుక్రవారం రోజంతా చినుకులు పడుతునే ఉన్నాయి. పనులపై బయటకు వచ్చిన వారందరూ గొడుగులు వేసుకొని వచ్చారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అరకులోయ పరిసర ప్రాంతాలో ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం అరకులోయ సంత కావడంతో నిత్యావసర సరుకులు కొనుగోలుకు వచ్చిన జనం ముసురుకు ఇబ్బంది పడ్డారు.

కొయ్యూరులో ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత చిరుజల్లులు ఆరంభమయ్యాయి. ఈ వర్షం ఖరీఫ్‌లో వరి నారు పోతకు ఉపకరిస్తుందని రైతులు అంటున్నారు.

చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ముసురు వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా వర్షపు జల్లులు పడుతున్నాయి. వర్షానికి ప్రాంతీయ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెదవలస వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు అవస్థలు పడ్డారు.

ముంచంగిపుట్టు మండలంలో కొద్ది రోజులుగా వర్షం వీడడం లేదు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. దారాపల్లి సమీపంలో కల్వర్టు కోతకు గురైంది. వాగులు, వంకలు, గెడ్డల్లో వరదనీరు ప్రవహిస్తున్నది. మట్టి రహదారులు బురదమయంగా మారాయి.

సీలేరులో శుక్రవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. అడపాదడపా మోస్తరు వర్షం కురవడం.. మరికొద్ది సేపు తెరిపివ్వడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. రోజు వారీ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు.

Updated Date - Jul 03 , 2026 | 11:16 PM