స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:40 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఇదే సమయంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నదని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా శ్రేణులు పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.
కూటమి శ్రేణులకు మంత్రి అనిత పిలుపు
సబ్బవరంలో అగ్నిమాపక కేంద్రం నూతన భవనం ప్రారంభం
సబ్బవరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఇదే సమయంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నదని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా శ్రేణులు పనిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. సబ్బవరంలో రూ.1.6 కోట్లతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని పంచకర్ల రమేశ్‌బాబు, ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకటరావుతో కలసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పలు అగ్నిమాపక కేంద్రాలకు భవనాలు నిర్మించడంతోపాటు ఆధునిక పరికరాలు, శకటాలను సమకూర్చినట్టు తెలిపారు. తాను పుట్టి పెరిగిన సబ్బవరంలో కాపు సామాజిక భవనం నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. తమ సొంతూరు నారపాడులో తన తండ్రి కోరిక మేరకు తాతగారి పేరున కల్యాణ మండపం నిర్మించాలని భావిస్తున్నానని, ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తానని, దీని కోసం స్థలం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌భాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ ఏడీ జి.శ్రీనివాసరావు, ఆర్‌ఎఫ్‌వో నిరంజన్‌రెడ్డి, డీఎఫ్‌వో ఆర్‌వీ రమణ, ఎఫ్‌వో కె.ఎల్లాజీ, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి గండి దేముడు, కూటమి నేతలు భరణికాన బాబూరావు, గండి ముత్యాలనాయుడు, ఇందలి రమణ, బీఏ రావు, శరగడం శంకరావు, కర్రి కనకరాజు, రేసుపూడి రమణ, రోమాల చంద్రశేఖర్, బలిరెడ్డి ప్రసాద్, బొండా కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.