మధ్యవర్తిత్వంలో నైపుణ్యం సాధించాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:56 AM
న్యాయ విద్యార్థులు మధ్యవర్తిత్వంలో (ఆర్బిట్రేషన్) నైపుణ్యం సాధించాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ సూచించారు.
న్యాయశాస్త్ర విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ సూచన
సబ్బవరం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): న్యాయ విద్యార్థులు మధ్యవర్తిత్వంలో (ఆర్బిట్రేషన్) నైపుణ్యం సాధించాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ సూచించారు. స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజులపాటు ‘డీఎస్‌ఎన్‌ఎల్‌యూ- విస్ ప్రీమూట్ 2వ ఎడిషిన్-2026’ నిర్వహించిన మధ్యవర్తిత్వ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తిత్వంలో నైపుణ్యం సాధించి ఈ రంగంలో నెలకొన్న లోటును భర్తీ చేయడానికి కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు వీసీ ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ఒక సబ్జెక్టుగా అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో ఇక్కడ మధ్యవర్తిత్వ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచన వుందని తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 20 విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి స్థానంలో రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా వర్సిటీ బృందం, రెండో స్థానంలో జిందాల్ గ్లోబల్ స్కూల్ బృందం నిలిచాయి. అనంతరం విజేతలకు జస్టిస్ హరినాథ్ చేతులు మీదగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ అహుజ (సింగపూర్ ఆర్బిట్రేటర్), అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ గణేశ్ చందు, వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచందద్రనాథ్ మాదాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.