Share News

గ్రేటర్‌లో కుర్చీలాట

ABN , Publish Date - Jan 14 , 2026 | 01:03 AM

జీవీఎంసీలో మూడు అదనపు కమిషనర్‌ పోస్టులు

గ్రేటర్‌లో కుర్చీలాట

జీవీఎంసీలో మూడు అదనపు కమిషనర్‌ పోస్టులు

మొన్నటి వరకూ ఒక పోస్టు ఖాళీగా ఉండడంతో యూసీడీ పీడీకి ఇన్‌చార్జి ఏడీసీగా బాధ్యతలు

ఇటీవల పూర్తిస్థాయి ఏడీసీని నియమించిన ప్రభుత్వం

అయినా ఇన్‌చార్జిని వెనక్కి పంపని ఉన్నతాధికారులు

ఛాంబర్‌లో ఆమె కొనసాగింపు

స్మార్ట్‌ సిటీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీఓసీలో కొత్త అధికారికి కుర్చీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో అదనపు కమిషనర్ల మధ్య కుర్చీలాట జరుగుతోంది. జీవీఎంసీలో అదనపు కమిషనర్‌ పోస్టులు మూడు ఉండగా, ప్రస్తుతం నలుగురు ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదనపు కమిషనర్లకు మూడు ఛాంబర్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో, ఒకరు సిటీ ఆపరేషన్‌ సెంటర్‌ (సీఓసీ)లో కూర్చుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు పూర్తిస్థాయి అదనపు కమిషనర్లు ఉండగా, యూసీడీ పీడీగా పనిచేసిన అధికారిణికి అదనపు కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.

జీవీఎంసీలో కమిషనర్‌కు పాలనాపరమైన అంశాల్లో సహాయ సహకారాలు అందించడంతోపాటు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకుగాను మూడు అదనపు కమిషనర్‌ పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఆ పోస్టులో సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపల్‌ కమిషనర్‌/జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులను నియమిస్తారు. కొన్నిసార్లు ఐఏఎస్‌ అధికారులను కూడా అదనపు కమిషనర్‌ పోస్టులో నియమిస్తున్నారు. ఇదిలావుండగా జీవీఎంసీలో అదనపు కమిషనర్‌లుగా పనిచేస్తున్న ముగ్గురిలో ఒకరైన సోమన్నారాయణ కొన్నాళ్ల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి డెప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ఆ పోస్టు చాలాకాలంపాటు ఖాళీగా ఉండిపోయింది. దీనివల్ల కమిషనర్‌కు పరిపాలనాపరంగా కొంత ఇబ్బందిగా మారడంతో యూసీడీ పీడీగా పనిచేస్తున్న సత్యవేణికి ఇన్‌చార్జి ఏడీసీ బాధ్యతలు అప్పగించారు. అయితే స్పెషల్‌గ్రేడ్‌ మునిసిపల్‌ కమిషనర్‌ స్థాయి కలిగిన సత్యవేణిపై ఏసీబీ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఇన్‌చార్జి ఏడీసీ బాధ్యతలు అప్పగించడం సరికాదంటూ కొందరు కమిషనర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పాలనాపరమైన అవసరం ఉన్నందున సీనియర్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ హోదా కలిగిన ఆమెకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం తప్పుకాదని మరికొందరు కమిషనర్‌ నిర్ణయాన్ని సమర్థించారు. ఎవరికైనా ఏడీసీ పోస్టింగ్‌ ఇవ్వాలన్నా, ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలన్నా కచ్చితంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కావాలని, అలాకాకుండా కమిషనర్‌ సొంత నిర్ణయంతో కిందిస్థాయి అధికారికి పైస్థాయి పోస్టు కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి, యూసీడీ పీడీగా తిరిగి పంపాలని కొందరు కమిషనర్‌కు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఆదేశాలతో ఇన్‌చార్జి ఏడీసీగా బాధ్యతలు చేపట్టిన సత్యవేణి గతంలో ఏడీసీగా పనిచేసి బదిలీపై వెళ్లిపోయిన సోమన్నారాయణ ఛాంబర్‌లో కూర్చుని విధులు నిర్వర్తిస్తున్నారు. జీవీఎంసీలో అధికారికంగా ఒక అదనపు కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉండడంతో విజయనగరం మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న పి.నల్లనయ్యను ఇటీవల ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నల్లనయ్య సోమవారం కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ను కలిసి ఏడీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రజారోగ్యంతోపాటు మరికొన్ని విభాగాల భాధ్యతలను అప్పగించిన కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, ఇన్‌చార్జి ఏడీసీగా తాను నియమించిన సత్యవేణిని వెనక్కి పంపకుండా, అదే పోస్టులో కొనసాగిస్తూ ఆమెకు కొన్ని విభాగాల బాధ్యతలను కేటాయించారు. కొత్తగా అదనపు కమిషనర్‌ను ప్రభుత్వం నియమించడంతో సత్యవేణిని తిరిగి యూసీడీ పీడీగా వెనక్కి పంపించేస్తారని భావించిన అధికారులు కమిషనర్‌ నిర్ణయంతో అవాక్కయ్యారు. పైగా కొద్దిరోజుల కిందటి వరకు ఖాళీగా ఉన్న ఏడీసీ చాంబర్‌ను సత్యవేణి వినియోగిస్తుండడంతో కొత్తగా ఏడీసీగా బాధ్యతలు చేపట్టిన నల్లనయ్యకు చాంబర్‌ లేకుండాపోయింది. దీంతో తాత్కాలికంగా స్మార్ట్‌ సిటీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీఓసీలో నల్లనయ్యకు సర్దుబాటు చేశారు. పూర్తిస్థాయి అదనపు కమిషనర్‌కు చాంబర్‌ లేకుండా ఇన్‌చార్జి ఏడీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్యవేణికి చాంబర్‌ కేటాయించడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 01:03 AM