వేగవంతంగా మ్యూజియం పనులు
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:34 PM
గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ ఆదేశించారు.
మే 15నాటికి పూర్తి కావాలి
నిర్మాణాలకు నిధుల కొరత లేదు
గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి జేసీ శ్రీపూజ
పనులు నెమ్మదిగా జరుగుతుండడంపై అసంతృప్తి
చింతపల్లి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ ఆదేశించారు. గురువారం ఆమె లంబసింగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను తనిఖీ చేశారు. తొలుత నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ్యూజియం నిర్మాణ పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని, కాంట్రాక్టర్లు అదనపు కార్మికులను ఏర్పాటు చేసి పనుల వేగాన్ని పెంచాలన్నారు. మ్యూజియం నిర్మాణాలను మే 15 నాటికి పూర్తి చేయాలన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ సకాలంలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూరేషన్ పనులను తనిఖీ చేసిన ఆమె స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు, సంప్రదాయ ఆయుధాల నిర్మాణంలో ప్రత్యేక మెలకువలు పాటించాలన్నారు. మ్యూజియం అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. లంబసింగి మ్యూజియం గిరిజన ప్రాంతానికి తలమానికం కానుందని, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులకు నిధుల కొరత లేదన్నారు. పనులకు సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈఈ డేవిడ్ రాజు, డీఈఈ రఘునాథరావునాయుడు, ఏఈఈ యాదకిశోర్, ట్రైబల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాదారాణి పాల్గొన్నారు.