శరవేగంగా మ్యూజియం పనులు
ABN , Publish Date - May 28 , 2026 | 11:14 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి(తాజంగి)లో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, స్వాతంత్య్ర పోరాట పటిమను ప్రతిబింబించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజంగిలో గిరిజన సంస్కృతికి అద్దంపట్టేలా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం
ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి
నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
ప్రధాని మోదీతో ప్రారంభించేందుకు సన్నాహాలు
చింతపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగి(తాజంగి)లో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, స్వాతంత్య్ర పోరాట పటిమను ప్రతిబింబించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 75 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది నవంబరు నాటికి పనులు పూర్తి చేసి ప్రధాని నరేంద్రమోదీతో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ ఏడాది పర్యాటక సీజన్‌నాటికి సందర్శకులకు మ్యూజియం అందుబాటులోకి రానున్నది.
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను గడగడ వణికించిన ఆదివాసీ పోరాటయోధుల చరిత్ర భావితరాలకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో రాష్ట్రానికి ‘గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం’ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మ్యూజియం నిర్మాణానికి రూ.45 కోట్లు కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.25 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లుగా ఒప్పందం కుదిరింది. లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజంగి డెయిరీ ఫారం భూములు 22 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. తొలివిడతగా పది ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇతర భూముల్లో రిసార్ట్స్ నిర్మించనున్నారు. మ్యూజియం నిర్మాణాలకు గత వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, కేంద్రం మంజూరు చేసిన నిధులు సైతం ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల నిర్మాణాలు తీవ్ర జాప్యం జరిగాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మ్యూజియం పనులకు కదలిక వచ్చింది. నిర్మాణాలకు అవసరమైన నిధులను మంజూరు చేయడంతో ఏడాదిన్నర కాలంలో పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మ్యూజియం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
గిరిజన సంస్కృతి, పోరాట పటిమ ఉట్టిపడేలా..
ప్రధాన మ్యూజియాన్ని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, స్వాతంత్య్ర పోరాట పటిమ ఉట్టిపడేలా రూపకల్పన చేస్తున్నారు. ప్రధాన మ్యూజియంలో నాలుగు బ్లాక్‌లు ఉన్నాయి. మ్యూజియం ప్రాంగణంలో ప్రవేశమార్గం, హాట్ ప్లాజా, రెస్టారెంట్ ఉంటుంది. ఈ సందర్శనకు ప్రవేశ రుసుము ఉండదు. మ్యూజియానికి వెళ్లేందుకు టికెట్ తీసుకోవాల్సి వుంటుంది. మ్యూజియం మొదటి బ్లాక్‌లో రిసెప్షన్, పరిపాలన కార్యాలయం, ప్రముఖుల(వీఐపీ)ల నిరీక్షణ హాల్ ఉంటుంది. బ్లాక్-2లో బ్రిటిష్ పాలకులు రాక ముందు గిరిజనుల స్థితిగతులు, పోడు వ్యవసాయం, జీవన విధానం ప్రదర్శిస్తారు. బ్లాక్-3లో బ్రిటిష్‌వారి రాక, పాలన ప్రారంభం, పన్ను వసూళ్లు, ఆంక్షలు, గిరిజనులపై బ్రిటిష్ పాలకుల అకృత్యాలు, హింస, ఆదివాసీల తిరుగుబాటు, పోరాట పటిమను ప్రదర్శిస్తారు. బ్లాక్-4లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివాసీల స్థితిగతులు, జీవనశైలిలో వచ్చిన మార్పు, ఆదివాసీల ప్రత్యేక హక్కులు, చట్టాలు, విద్య, ఉద్యోగం, రాజకీయం, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారం, ఉన్నత స్థాయికి చేరుకున్న ఆదివాసీల వివరాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనల ద్వారా నాటి ఆదివాసీ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం స్వయంగా వీక్షించిన అనుభూతి కలిగించే విధంగా తీర్చిదిద్దనున్నారు.
తుది దశకు నిర్మాణాలు
గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించడం వల్ల మ్యూజియం పనులు వేగవంతమయ్యాయి. మ్యూజియంలో ఫినిషింగ్ వర్కులు జరుగుతున్నాయి. నవంబరు నాటికి శతశాతం పనులు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మ్యూజియాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీతో ప్రారంభించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ పర్యాటక సీజన్ నాటికి సందర్శకులకు మ్యూజియం అందుబాటులోకి వస్తుంది. రానున్న రోజుల్లో లంబసింగిని ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శించే అవకాశం ఉంటుంది.