శరవేగంగా మ్యూజియం నిర్మాణ పనులు
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:21 PM
చింతపల్లిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.వంశీకృష్ణ తెలిపారు.
డిసెంబరులో ప్రారంభించేందుకు చర్యలు
మాకవరపాలెంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్
గిరిజన సంక్షేమశాఖ డీఈఈ వంశీకృష్ణ
చింతపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
చింతపల్లిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమశాఖ డివిజన్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియం పనులు 80 శాతం పూర్తయ్యాయని, నవంబరు నాటికి పూర్తి చేసి డిసెంబరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబ్ డివిజన్ పరిధిలో పీఎం జన్‌మన్ పథకం ద్వారా తొమ్మిది అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. జీకేవీధికి ఆరు, చింతపల్లికి రెండు, కొయ్యూరుకి ఒకటి నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని ఆయన చెప్పారు. ఈ భవనాల నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామన్నారు.
మాకవరపాలెంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్
అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో రూ.10 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ మెషీనరీ, సివిల్ పనులకు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రాసెసింగ్ యూనిట్‌లో క్యూరింగ్, అల్లింగ్, రోస్టరింగ్, గ్రైండింగ్, ఇన్‌స్టంట్, ఫిల్టర్ కాఫీ పౌడర్ తయారీ, ప్యాకింగ్ జరుగుతుందన్నారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్‌కు వారం రోజుల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో చింతపల్లి, జీకేవీధి ఏఈఈలు జి.రఘునాథరావునాయుడు, యాదకిశోర్ పాల్గొన్నారు.