మ్యూజియం నిర్మాణాలు వేగవంతం
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:15 AM
గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కేవీఎస్‌ఎన్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు గిరిజన సంక్షేమశాఖ ఎస్‌ఈ ఆదేశం
చింతపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కేవీఎస్‌ఎన్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. మ్యూజియం నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. పర్యాటక సీజన్ నాటికి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మ్యూజియం అందుబాటులోకి వస్తే ఏడాది పొడవునా లంబసింగిని పర్యాటకులు సందర్శిస్తారని చెప్పారు. మ్యూజియం నిర్మాణాలను ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ పనుల వేగాన్ని పెంచాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ మొత్తంలో నిధులు విడుదల చేసిందన్నారు. పీఎం జన్‌మన్, డీఏ జుగా నిధులతో అదనపు తరగతి భవనాలు, మరుగుదొడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట డీఈఈ జి.రఘునాథరావు నాయుడు, ఏఈఈ యాదకిశోర్ ఉన్నారు.