Share News

మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:47 PM

లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంవోటీఏ) డైరెక్టర్‌ దీపాలి మసిర్‌కర్‌ ఆదేశించారు.

మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం
మాట్లాడుతున్న ఎంవోటీఏ డైరెక్టర్‌ దీపాలి మసిర్‌కర్‌, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

సెప్టెంబరులో ప్రారంభించాలి

పనుల పురోగతి సంతృప్తికరం

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ దీపాలి మసిర్‌కర్‌

చింతపల్లి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంవోటీఏ) డైరెక్టర్‌ దీపాలి మసిర్‌కర్‌ ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్‌తో కలిసి ఆమె చింతపల్లి మండలంలో పర్యటించారు. తొలుత లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గిరిజన సంక్షేమశాఖ అధికారులు, ఇంజనీర్లతో మ్యూజియం పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం లంబసింగికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుందన్నారు. మ్యూజియం అందుబాటులోకి వస్తే లంబసింగి సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. స్థానిక ఆదివాసీల జీవన విధానంలో మార్పు వస్తుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మ్యూజియాన్ని అత్యంత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. మ్యూజియం నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. మ్యూజియం పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ అధికారులు, ఇంజనీర్లు కృషి చేయాలన్నారు. మ్యూజియాన్ని సెప్టెంబరులో కచ్చితంగా ప్రారంభించాలన్నారు. మ్యూజియం నిర్మాణ పనుల పురోగతి సంతృప్తికంగా ఉందన్నారు. అనంతరం చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ను సందర్శించారు. ఎకో పల్పింగ్‌ ద్వారా ఆదివాసీ కాఫీ రైతులకు అందుతున్న సేవలను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మను అడిగి తెలుసుకున్నారు. వన్‌ధన్‌ వికాస్‌ యోజన(వీడీవీకే)ల ద్వారా ఆదివాసీల జీవన విధానంలో మార్పు తీసుకురావాలని పీవోకి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కన్సల్టెంట్‌ శృతి వశిష్ట్‌, టీసీఆర్‌, టీఎం డైరెక్టర్‌ రాణి మందా, క్యూరేటర్‌ శెట్టి శ్రీనివాస్‌, టీడబ్ల్యూ చీఫ్‌ ఇంజనీర్‌ బి. వసంత, ఈఈ డేవిడ్‌రాజు, డీఈఈ జి.రఘునాథరావు నాయుడు, ఏఈ యాదకిశోర్‌, కాఫీ ఏడీ ఐతి కుమారి, మ్యాక్స్‌ చైర్మన్‌ జనకాని సింహాచలం, అకౌంటెంట్‌ యస్‌.పడాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 10:48 PM