Share News

మ్యూజియం నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 14 , 2026 | 11:33 PM

లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సుధా భార్గవి ఆదేశించారు.

మ్యూజియం నిర్మాణాలు వేగవంతం చేయాలి
మ్యూజియం నిర్మాణాలను పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ సుధా భార్గవి, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ

టీడబ్ల్యూ డైరెక్టర్‌ సుధా భార్గవి ఆదేశం

15 రోజుల్లో రెండు బ్లాక్‌లు ప్రారంభించాలి

గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల శిల్పాలు సిద్ధం

చింతపల్లి, మే 14 (ఆంధ్రజ్యోతి): లంబసింగి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సుధా భార్గవి ఆదేశించారు. గురువారం మ్యూజియం నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారులు మ్యూజియం తుది దశ నిర్మాణాలు, పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లంబసింగిలో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం రాష్ట్రానికి తలమాణికం కానున్నదన్నారు. మ్యూజియం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం జరుగుతుందని, గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన గిరిజన పోరాటయోధుల చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మ్యూజియంలో ఏర్పాటు చేసే ఉద్యమకారుల శిల్పం, చిత్రం పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఉండాలన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల శిల్పాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 15 రోజుల్లో బ్లాక్‌ 1,2 ప్రారంభించాలన్నారు. ఈ బ్లాకుల్లో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. పనులను జాప్యం చేయరాదని, నిధుల కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. మ్యూజియం అందుబాబులోకి వస్తే లంబసింగి సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. మ్యూజియం నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇంజనీరింగ్‌ అధికారులను సమీక్షించాలని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ వసంత, టీఆర్‌ఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం. రాణి, డీడీ పీబీకే పరిమళ, ఈఈ డేవిడ్‌రాజ్‌, డీఈఈ రఘునాథరావు నాయుడు, ఏఈఈ యాదకిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 11:33 PM