కొత్తపాలెం శివారులో హత్య?
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:34 AM
సగానికి పైగా కాలిపోయిన మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎవరైనా హత్య చేసి దహనం చేసేందుకు యత్నించారా, మరేదైనా కారణమా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలెం గ్రామ శివారు రైల్వే ట్రాక్ వద్ద గల ఖాళీ స్థలంలో లభించిన సగం కాలిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి...
దహనం చేసేందుకు యత్నం
సగం కాలిన మృతదేహం లభ్యం
సంఘటనా స్థలంలో లభించని ఆధారాలు
గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు
గోపాలపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):
సగానికి పైగా కాలిపోయిన మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఎవరైనా హత్య చేసి దహనం చేసేందుకు యత్నించారా, మరేదైనా కారణమా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలెం గ్రామ శివారు రైల్వే ట్రాక్ వద్ద గల ఖాళీ స్థలంలో లభించిన సగం కాలిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి...
జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం శివారు రైల్వే ట్రాక్ దాటిన తరువాత పెద్దూరుదిబ్బలు (పులంబొట్లపాలెం) వ్యవసాయ క్షేత్రాల వద్ద సగం కాలిన మృతదేహాన్ని బుధవారం కొంతమంది రైతులు గుర్తించారు. వెంటనే గోపాలపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కాగా అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. సుమారు 40 ఏళ్ల వయసు గల వ్యక్తిని ఎవరో హత్య చేసి మృతదేహాన్ని కాల్చే ప్రయత్నం చేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే హత్య ఈ ప్రాంతంలోనే జరిగిందా లేక ఎక్కడో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి దహనం చేసేందుకు ప్రయత్నం చేశారా?...అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి సీఐ లెంక సన్యాసినాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికుల్లో ఆందోళన
కొత్తపాలెం గ్రామ శివారులో సగంకాలిన మృతదేహం లభించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఎల్లపువానిపాలెం నుంచి కొత్తపాలెం గ్రామ శివారులోని రైల్వే ట్రాక్, ఎంఈఎస్ పంపుహౌస్ ఏరియా, సంతోష్‌నగర్, వెంకటాపురం ఐదుమదాల ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని, మత్తుపదార్ధాలు, మద్యం సేవించేవారు నిత్యం సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించలేకపోతున్నామన్నారు. పోలీసులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.