Share News

శ్రీరాంపురంలో హత్య

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:41 AM

మండలంలోని రైవాడ శివారు శ్రీరాంపురంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడన్న ఉద్దేశంతో ప్రియుడి సహకారంతో హత్య చేయించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

శ్రీరాంపురంలో హత్య
అప్పలనాయుడు (ఫొటో)

ప్రియుడి సహకారంతో చంపించిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని అఘాయిత్యం

దేవరాపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైవాడ శివారు శ్రీరాంపురంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడన్న ఉద్దేశంతో ప్రియుడి సహకారంతో హత్య చేయించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

శ్రీరాంపురం గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి అప్పలనాయుడు (38)కు విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం పోతనాపల్లికి చెందిన హైమతో 2016లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఎనిమిదేళ్ల అనీష, ఐదేళ్ల యోక్షిత అనే కుమార్తెలు ఉన్నారు. అప్పలనాయుడు కుటుంబ పోషణ కోసం విశాఖలో కలాసీగా పనిచేస్తూ రోజూ ఇంటి నుంచి రాకపోకలు సాగించే వాడు. భార్య హేమ వెలుగు వీఓఏగా పనిచేస్తున్నది. ఈ నేపథ్యంలో కె.కోటపాడు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన బండారు గంగాధర్‌ సుమారు నాలుగేళ్ల క్రితం దేవరాపల్లిలోని జియో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు హేమతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. గంగాధర్‌ కొంతకాలం క్రితం జియో కార్యాలయంలో ఉద్యోగం మానేసి, దేవరాపల్లిలో సొంతంగా రెస్టారెంట్‌ ప్రారంభించాడు. హేమ, గంగాధర్‌ మధ్య వివాహేతర సంబంధం వున్నట్టు తెలియడంతో అప్పలనాయుడు భార్యను మందలించాడు. అయినా ఆమె తీరు మారకపోవడంతో విశాఖలో కలాసీ పనిని వదిలేసుకొని, శ్రీరాంపురంలో కూలి పనులకు వెళుతున్నాడు. భర్త ఇంటి వద్దనే వుండడంతో గంగాధర్‌ను కలవడానికి హేమకు వీలు కావడంలేదు. దీంతో భర్తను అంతమొందించేందుకు గంగాధర్‌తో కలసి పథకం వేసింది. బుధవారం రాత్రి ఇద్దరు కుమార్తెలను వరండాలో నిద్రపుచ్చింది. అప్పలనాయుడు ఇంటి లోపల పడుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గంగాధర్‌కు సమాచారం ఇచ్చింది. అతను కొంతమంది మనుషులను పంపగా, వారి చేత భర్త గొంతు నులిమి హత్య చేయించింది. గురువారం ఉదయం వీరి ఇంటికి వచ్చిన అప్పలనాయుడు తమ్ముడు ఎర్రన్నాయుడు.. తన అన్న హత్యకు గురైనట్టు తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కె.కోటపాడు సీఐ కృష్ణ, స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ శ్రీరాంపురం వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కె.కోటపాడు సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు. ఎర్రన్నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:41 AM