పెదగదిలిలో హత్య
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:50 AM
క్రికెట్ ఆడుతుండగా రేగిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది.
యువకుడిపై కత్తితో దాడి
క్రికెట్‌లో తలెత్తిన ఘర్షణే కారణం
ఆరిలోవ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి):
క్రికెట్ ఆడుతుండగా రేగిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఆరిలోవ పెదగదిలి జంక్షన్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదగదిలి ప్రాంతానికి చెందిన డోలా అజిత్ అలియాస్ పెద్ద (23)తోపాటు మరికొందరు పెదగదిలి జంక్షన్‌లో క్రికెట్ ఆడుతున్నారు. అక్కడికి వచ్చిన గంటా కిషోర్ పక్కన కూర్చొని మ్యాచ్ చూస్తున్నాడు. అజిత్ బ్యాటింగ్ చేస్తుండగా ఒక్క పరుగు విషయంలో ఇతర ఆటగాళ్లతో వాగ్వాదం జరిగింది. అంపైర్‌గా వ్యవహరిస్తున్న చిరంజీవి వివాదాన్ని సర్దుబాటు చేశాడు. ఇదంతా పక్క నుంచి చూస్తున్న గంటా కిషోర్ చిరంజీవితో వాగ్వాదానికి దిగాడు. దీనిని అజిత్ ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. ఇంతలో పక్కన ఉన్నవారు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కాగా కిషోర్ ప్రవర్తన సక్రమంగా లేకపోవడం, అనవసరంగా గొడవలు పడుతుండడంతో అతని తల్లిదండ్రులు ఇంట్లోనుంచి వెళ్లగొట్లేశారు. స్వతహాగా బాక్సర్ అయిన కిషోర్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ప్రేమవివాహం చేసుకుని విశాలక్షినగర్‌లో నివాసముంటున్నాడు. అప్పుడప్పుడు పెదగదిలి వచ్చివెళుతుంటాడు.
ఇదిలాఉండగా సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కిషోర్ విశాలక్షినగర్ నుంచి పెదగదిలివచ్చి అంపైర్‌గా వ్యవహరించిన చిరంజీవితో మళ్లీగొడవపడ్డాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న అజిత్‌పై దాడిచేసి, తనతోపాటు తెచ్చుకున్న కత్తితో అజిత్ ఛాతిలో పొడిచేశాడు. దీనిని అక్కడే ఉన్న నాగు అడ్డుకునేందుకు యత్నించగా, అతనికి కూడా గాయాలయ్యాయి. అజిత్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, నాగును సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, సీఐ మల్లేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.