ఇసుకతోటలో హత్య
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:17 AM
పాత కక్షల నేపథ్యంలో నగరంలో ఓ యువకుడిని రౌడీషీటర్ పల్లా అనిల్, మరికొందరు కత్తులతో పొడిచి చంపారు.
మరొకరి పరిస్థితి విషమం
కత్తితో రౌడీ గ్యాంగ్ దాడి
ఎంవీపీ కాలనీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):
పాత కక్షల నేపథ్యంలో నగరంలో ఓ యువకుడిని రౌడీషీటర్ పల్లా అనిల్, మరికొందరు కత్తులతో పొడిచి చంపారు. బుధవారం అర్ధరాత్రి ఇసుకతోట రామాలయం వీధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన బొచ్చు వెంకటేష్ (19), బాకీ సంతోష్ (25)లు వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం నగరంలో ఉంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతానికి చెందిన పల్లా అనిల్ కూడా నగరంలోని వెంకోజీపాలెంలో ఉంటున్నాడు. అతడిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉంది. ఇటీవలి కాలంలో అనిల్ ఆగడాలు ఎక్కువ కావడంతో నగర బహిష్కరణ చేశారు. కొద్దిరోజుల క్రితం మళ్లీ నగరానికి వచ్చాడు. అనిల్‌కు, వెంకటేష్, సంతోష్‌లకు మధ్య గతంలో పరిచయం ఉంది. వెంకటేష్ భార్య విషయంలో అనిల్ వైఖరిపై గొడవలు జరిగాయి. మూడు నెలల క్రితం ఎంవీపీ స్టేషన్‌లో పంచాయితీ జరిగినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై బుధవారం అర్ధరాత్రి ఇరువర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వెంకటేష్, సంతోష్‌లపై అనిల్ తన బృందంతో దాడి చేశాడు. కత్తితో పొడవడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందగా, సంతోష్ గాయపడ్డాడు. దాడిలో పన్నెండు మంది వరకూ పాల్గొన్నట్టు చెబుతున్నారు. ఇందులో ఒక బాలుడు ఉన్నట్టు సమాచారం. నిందితులపై హత్య, హత్యాయత్నం సెక్షన్‌ల కింద కేసు నమోదుచేశారు. సంఘటనా స్థలాన్ని సీపీ శంఖబ్రతబాగ్చీ పరిశీలించారు. ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో సీఐ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.