అమర్‌నగర్‌లో హత్య
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:14 AM
పాతకక్షలు పడగవిప్పి కత్తులు దూసుకోవడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కత్తులతో పరస్పర దాడి
ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు
పాత కక్షల నేపథ్యంలోనే సంఘటన
ఘటనా స్థలంలో కత్తులు
కనిపించకపోవడంపై అనుమానాలు
మద్దిలపాలెం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
పాతకక్షలు పడగవిప్పి కత్తులు దూసుకోవడంతో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సీబీఎం కాంపౌండ్ అమర్‌నగర్‌లో గురువారం ఉదయం జరిగింది. ఇందుకు సంబంధించి మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివి.
అమర్‌నగర్‌కు చెందిన కింజరాపు గంగాధర్ (26), జ్ఞానపురానికి చెందిన కంట శివశంకర్ (36) డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన గొడవలో శివశంకర్‌పై గంగాధర్, చంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అతను త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన చంటి, గంగాధర్ బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి శివశంకర్‌పై గంగాధర్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో బుధవారం అమర్‌నగర్‌లో తెలిసినవారు మృతిచెందడంతో శివశంకర్ పరామర్శకు వెళ్లాడు. వారు గంగాధర్‌కు కూడా కావాల్సిన వారు కావడంతో అతడూ అక్కడే ఉన్నాడు. రాత్రంతా గంగాధర్, శివశంకర్ మృతదేహం వద్దే ఉన్నారు. ఉదయం 5.50 గంటల ప్రాంతంలో గంగాధర్ పక్కనే ఉన్న సచివాలయం లోపలికి వెళ్లాడు. మరో ఐదు నిమిషాలకు శివశంకర్ కూడా వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రక్తం మడుగులో పడి ఉన్న ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగాధర్ మృతిచెందాడు.
కనిపించని కత్తులు
అమర్‌నగర్ సచివాలయం వద్దకు పోలీసులు వెళ్లేసరికి గంగాధర్, శివశంకర్ కత్తిపోట్లతో పడిఉన్నారు. గాయాలకు కారణమైన కత్తులు కనిపించలేదు. స్థానికులు మాత్రం శివశంకర్ కత్తి తీసుకుని వెళ్లడాన్ని చూశామని చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరూ కత్తిపోట్లతో పడివుంటే కత్తులను ఎవరు మాయం చేశారో అంతుబట్టని ప్రశ్నగా మారింది. గంగాధర్, శివశంకర్‌ల మధ్య పాతకక్షల నేపథ్యంలో దాడి చేసుకున్నారని భావిస్తున్నప్పటికీ, కత్తులు కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, కత్తులను వెతికే పనిలో ఉన్నారు.