మాతృత్వ సంరక్షణలో రాష్ట్రంలోనే ముంచంగిపుట్టు సీహెచ్‌సీ ప్రథమం
ABN , Publish Date - May 23 , 2026 | 12:14 AM
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) గిరిజన ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సరికొత్త రికార్డు సృష్టించింది.
అత్యధిక సురక్షిత ప్రసవాల నమోదుపై అభినందనలు
వైద్యులు, సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ప్రశంసలు
ముంచంగిపుట్టు, మే 22 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) గిరిజన ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సరికొత్త రికార్డు సృష్టించింది. మాతృత్వ సంరక్షణ (మెటర్నల్ కేర్) విభాగంలో ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి ఆరోగ్య ఆసుపత్రుల కంటే అత్యధిక సురక్షిత ప్రసవాలను నమోదు చేసిన సీహెచ్‌సీగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ విజయానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కేవీఎన్.చక్రధర్‌బాబు (ఐఏఎస్) సీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు అధికారిక ప్రశంసా పత్రాన్ని సీహెచ్‌సీకి పంపించారు. గిరిజన ప్రాంతాల్లోని గర్భిణిలకు సురక్షితమైన మాతృత్వాన్ని అందించడంలో ఇక్కడి వైద్యులు, సిబ్బంది చూపిన నైపుణ్యం, నిబద్ధతను ఆయన అభినందించారు. అలాగే మాతృ మరణాల రేటును తగ్గించడంలో, గ్రామీణ ఆరోగ్య ప్రమాణాలను పెంచడంలో ముంచంగిపుట్టు వైద్య సిబ్బంది పోషించిన పాత్రను కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు ముంచంగిపుట్టు సీహెచ్‌సీ రోల్ మోడల్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో తమ ఆసుపత్రికి మొదటి స్థానం దక్కడం, ప్రభుత్వం నుంచి ప్రత్యేక అభినందనలు రావడం పట్ల వైద్యులు, సిబ్బంది, స్థానికులు, గిరిజన సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.