Share News

పారిశ్రామిక వాడల జాబితాలో మునగపాక

ABN , Publish Date - May 15 , 2026 | 11:52 PM

కేవలం వ్యవసాయ ఆధారిత మండలంగా ఉన్న మునగపాకకు పారిశ్రామికవాడల జాబితాలో చోటు లభించడం శుభపరిణామమని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు.

పారిశ్రామిక వాడల జాబితాలో మునగపాక
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

టి.సిరసపల్లిలో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌కు భూమి పూజ

మునగపాక, మే 15 (ఆంధ్రజ్యోతి): కేవలం వ్యవసాయ ఆధారిత మండలంగా ఉన్న మునగపాకకు పారిశ్రామికవాడల జాబితాలో చోటు లభించడం శుభపరిణామమని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. మండలంలోని టి.సిరసపల్లి గ్రామంలో 160 ఎకరాల్లో రూ.489 కోట్లతో ఏర్పాటుకానున్న భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌కు శుక్రవారం ఆమె భూమిపూజ చేశారు. పుట్టపర్తిలో దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌ విధానంలో చేసిన శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ స్కీన్‌పై ఎమ్మెల్యేలు సుందరపు విజయకుమార్‌, బండారు సత్యనారాయణమూర్తిలతో కలిసి ఆమె వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల త్యాగంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశ రక్షణకు సంబంధించి స్వదేశీ క్షిపణుల తయారీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు. స్థానికులకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని బీడీఎల్‌ ప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ మాట్లాడుతూ దేశ రక్షణలో మారుమూల గ్రామం అయిన టి.సిరసపల్లి భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందన్నారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఏఓబీ గోడ పూర్తి చేశామని చెప్పారు. నియోజకవర్గంలో నేవీ, డీఆర్‌డీవో, బార్క్‌ వంటి సంస్థలు ఉన్నాయని, ఇప్పుడు బీడీఎల్‌ కూడా రావడం గర్వకారణమన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దేశానికి రక్షణ రంగం ఎంత ముఖ్యమో, త్యాగాలకు సిద్ధపడి భూములిచ్చిన రైతుల సేవలను కూడా గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల కలయికతో రాష్ట్రంతో పాటు దేశం ఎంతో పురోభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ,, బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్త రాజేశ్వరి, కెప్టెన్‌ విజేంద్రసింగ్‌ నానియా, సీజీఎం మనోజ్‌కుమార్‌, రిటైర్డ్‌ కమాండర్లు సుజయ్‌కపూర్‌, గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:52 PM