మ్యూల్..గోల్‌మాల్
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:27 AM
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు (అక్రమంగా సంపాదించిన సొమ్మును దాయడానికి, తరలించడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతా. ఈ ఖాతా ఒకరి పేరుపై ఉంటుంది.
కమీషన్ లేదా అద్దెకు బ్యాంకు ఖాతాలు
ఏజెంట్ల ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, అమాయకులకు వల
వాటి ద్వారానే సొమ్ము కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు
షెల్ కంపెనీలకు మళ్లించుకుని విత్‌డ్రా
గత ఏడాదికాలంలో 400 మంది మ్యూల్ అకౌంట్‌దారులు అరెస్టు
కమీషన్‌కు కక్కుర్తిపడితే కటకటాలపాలు కావలసి ఉంటుందని పోలీసుల హెచ్చరిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు (అక్రమంగా సంపాదించిన సొమ్మును దాయడానికి, తరలించడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతా. ఈ ఖాతా ఒకరి పేరుపై ఉంటుంది. వేరొకరు వినియోగిస్తుంటారు) వరంగా మారుతున్నాయి. ఆ అకౌంట్‌ల ద్వారానే తాము కొల్లగొట్టిన డబ్బును దేశం దాటించి తమ జేబులో వేసుకుంటున్నారు. దీనివల్ల నిందితులను పట్టుకోవడం పోలీస్‌లకు సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లను ఇస్తున్న వారిపై పోలీసులు దృష్టిపెట్టారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నేరాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నారు. ఎందుకంటే మోసం ఇక్కడ జరిగితే నేరగాళ్లు నైజీరియా, కాంబోడియా, చైనా వంటి దేశాల్లో ఉంటున్నారు. బాధితుడి నుంచి కొల్లగొట్టిన డబ్బు కనీసం పది నుంచి 20 మ్యూల్ అకౌంట్‌ల ద్వారా మారుతూ చివరకు విదేశాల్లో ఉంటున్న నిందితుల ఖాతాలు, షెల్ కంపెనీల ఖాతాలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని నేరగాళ్లకు ముకుతాడు వేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేరం జరిగిన వెంటనే గనుక బాధితుడు సమాచారం ఇస్తే పోలీసులు స్పందించి డబ్బు ఏ ఖాతాలోకి వెళ్లిందో చూసి ఆ నిధులను ఫ్రీజ్ చేయాల్సిందిగా బ్యాంకు అధికారులను కోరుతున్నారు. బాధితులు ఆలస్యం చేస్తే మాత్రం ఆ నిధులు కొన్ని మ్యూల్ అకౌంట్లు మారి విదేశాలకు చేరిపోతాయి. కాబట్టి డబ్బు రికవరీ సాధ్యపడదు.
పోలీసులు సైబర్ నేరాల్లో బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్యాంకు ఖాతాలను విశ్లేషిస్తే డబ్బు బదిలీ అయిన అకౌంట్‌లన్నీ మ్యూల్ అకౌంట్‌లేనని తేలుతోంది. బాధితుడి ఖాతా నుంచి డబ్బు డిపాజిట్ అయిన ఖాతాకు సంబంధించిన వ్యక్తికి ఆ నేరంతో ఎలాంటి సంబంధం ఉండడం లేదు. కేవలం కమీషన్ కోసం కక్కుర్తిపడి తమ ఖాతాలను ఇతరులకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది.
మ్యూల్‌ఖాతాలు సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు
ఇటీవల కాలంలో మ్యూల్ ఖాతాల ద్వారా మోసాలు పెరుగుతుండడంతో పోలీసులు వాటిని సరఫరా చేసిన వారితోపాటు అకౌంట్‌దారులపై కూడా కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తున్నారు. గత ఏడాది కాలంలో మ్యూల్ అకౌంట్‌లను సైబర్ నేరగాళ్లకు సరఫరా చేసిన ఏజెంట్‌లతోపాటు ఖాతాదారులు దాదాపు 400 మందిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు
కమీషన్‌కు ఆశపడి ఖాతాలు ఇస్తే కటకటాలే
కె.భవానీప్రసాద్, సైబర్‌క్రైమ్ సీఐ
కొంతమంది కమీషన్లకు కక్కుర్తిపడి తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాటిని ఉపయోగించుకుని ప్రజల డబ్బును కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్‌లు ఇచ్చినట్టయితే వారిపై కేసులు నమోదుచేసి జైలుకు పంపిస్తున్నాం. ఎవరైనా రూ.పది వేలు ఇస్తామని ఆశచూపితే బ్యాంకు ఖాతాలు ఇవ్వకండి. బ్యాంకు ఖాతాలు ఇస్తే డబ్బులు, ఇతర బహుమతులు ఇస్తామని చెబితే అలాంటి వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. డబ్బుకోసం కక్కుర్తిపడి ఖాతాలు ఇస్తే ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టేనని అందరూ తెలుసుకోవాలి.
ఏమిటీ మ్యూల్ ఖాతా...
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని, అమాయకులను, పేదలను కొందరు ఏజెంట్‌లు గుర్తించి కమీషన్ ఆశ చూపించి బ్యాంకు ఖాతా తెరవడం, అప్పటికే వారి పేరిట ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌బుక్, డెబిట్ కార్డులను తీసుకుంటారు. వాటిని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మ్యూల్ అకౌంట్‌లను సరఫరా చేయకుండా అడ్డుకోగలిగితే సైబర్ నేరాలకు పాల్పడే వారిని సులభంగా గుర్తించవచ్చుననేది పోలీసుల భావన.