ముడసర్లోవ నీరు కలుషితం
ABN , Publish Date - Apr 07 , 2026 | 01:14 AM
నగరవాసులకు తాగునీటిని అందించే ముడసర్లోవ రిజర్వాయర్‌లో మురుగునీరు కలుస్తోంది.
రిజర్వాయర్‌లోకి నేరుగా మురుగునీరు ప్రవాహం
మురుగునీటిని శుద్ధి చేసేందుకు పంప్ హౌస్ ఉన్నా కానరాని ప్రయోజనం
సిబ్బంది నిర్లక్ష్యం
పట్టించుకోని జీవీఎంసీ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరవాసులకు తాగునీటిని అందించే ముడసర్లోవ రిజర్వాయర్‌లో మురుగునీరు కలుస్తోంది. అక్కడ నిర్మించిన పంప్‌హౌస్ సరిగా పనిచేయకపోవడంతో మురుగునీటితోపాటు మలమూత్రాలు నేరుగా రిజర్వాయర్‌లో కలిసిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లతోపాటు ముడసర్లోవ రిజర్వాయర్ నీటిని జీవీఎంసీ వినియోగించుకుంటుంది. ముడసర్లోవ రిజర్వాయర్ పూర్తిగా జీవీఎంసీ ఆధీనంలో, మిగిలినవన్నీ నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉన్నాయి. ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి ప్రతిరోజూ 0.5 మిలియన్ గ్యాలన్లు (ఎంజీడీ) నీటిని ప్రజల తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. గతంలో రిజర్వాయర్ పరిధిలో పెద్దగా నివాసాలు లేకపోవడంతో మురుగునీరు కలిసి నీరు కలుషితం అవుతుందనే భయం ఉండేది కాదు. కాలక్రమేణా భారీగా నివాసాలతోపాటు ఆస్పత్రులు, చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో వ్యర్థ జలాలు ఉత్పత్తి కూడా పెరిగిపోయింది. అడవివరం, ధారపాలెం, శ్రీకృష్ణాపురం, రామకృష్ణాపురం, పెదగదిలి వంటి ప్రాంతాల నుంచి మురుగునీరు నేరుగా పల్లపు ప్రాంతంలో ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్‌లోకి చేరడంతో నీరు కలుషితం అవుతుండేది. దీంతో జీవీఎంసీ అధికారులు రిజర్వాయర్ పక్కనే ఒక పంప్‌హౌస్‌ను నిర్మించి, ఆ మురుగునీటిని సమీపంలో ఉన్న 13 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు (ఎస్‌టీపీ)లోకి మళ్లించేలా ఏర్పాటు చేశారు. అయితే ఆ పంప్‌హౌస్ నుంచి పూర్తిస్థాయిలో మురుగునీరు పంపింగ్ కాకపోవడంతో ఇటీవల కాలంలో తిరిగి నేరుగా రిజర్వాయర్‌లో కలుస్తోంది. దీనివల్ల తాగునీరు కలుషితం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం పంప్‌హౌస్ వద్ద పనిచేసే సిబ్బందికి తెలిసినప్పటికీ ఏమీ పట్టనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కమిషనర్ దృష్టిసారించాలని కోరుతున్నారు. ఈ విషయం ఇంజనీరింగ్ అధికారుల వద్ద ప్రస్తావించగా, పంప్‌హౌస్ నుంచి మురుగునీరు నేరుగా రిజర్వాయర్‌లో కలుస్తున్నట్టు తమకు తెలియదని, దీనిపై దృష్టిసారించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.