Share News

వడివడిగా ఎంఎస్‌ఎంఈలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:14 AM

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్నది. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కోడూరులో పార్కు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. దాదాపు 70 శాతం ప్లాట్లను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాల్లో భూ సేకరణ దశల్లో వున్నాయి. ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో గత టీడీపీ హయాంలోనే ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసింది.

వడివడిగా ఎంఎస్‌ఎంఈలు
అనకాపల్లి మండలం కోడూరు ఎంఎస్‌ఎంఈ పార్కులో పూర్తయిన మౌలిక వసతుల పనులు

అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో 250 ప్లాట్లు

మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి

170 మందికి ప్లాట్లు కేటాయింపు

నెల రోజుల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రారంభం

మాకవరపాలెం, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు మండలంలో భూముల గుర్తింపు

త్వరలో ఏపీఐఐసీకి అప్పగించనున్న రెవెన్యూ అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు పనులు వేగవంతం అయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొన్నది. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కోడూరులో పార్కు ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. దాదాపు 70 శాతం ప్లాట్లను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాల్లో భూ సేకరణ దశల్లో వున్నాయి. ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో గత టీడీపీ హయాంలోనే ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేసింది.

వికసిత్‌ భారత్‌-2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం తక్కువ పెట్టుబడితో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌ కోసం సేకరించిన భూముల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 2018లోనే ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటైంది. ఇక్కడ పలు సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు విజయవంతంగా నడుస్తున్నాయి. జిల్లాలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు దశల్లో ఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నది. అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయగా, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవున అంతర్గత రోడ్లను, వాటి పక్కనే ఓపెన్‌ డ్రైనేజీ కాలువలను నిర్మించారు. రహదారులకు ఇరువైపులా విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి, లైట్లను అమర్చారు. నీటి సదుపాయం కోసం బోర్లు వేసి, ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మించారు. సుమారు 250 ప్లాట్లు వేశారు. ఇది పాత, కొత్త జాతీయ రహదారులకు చేరువలో వుండడంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. అధికారులు ఇప్పటికే సుమారు 170 మందికి ప్లాట్‌లను కేటాయించారు. ఇక్కడ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పార్కులో నెల రోజుల్లో పరిశ్రమల ఏర్పాటు మొదలవుతుందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.

రెండో దశలో నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో 290 ఎకరాలు, చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలం భీమవరం, మల్లాం పంచాయతీల పరిధిలో 200 ఎకరాలు, మాడుగుల నియోజకవర్గ పరిధిలోని కె.కోటపాడు మండలం ఆర్లి గ్రామంలో 100 ఎకరాలను ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే చేసిన అనంతరం సరిహద్దులను నిర్ధారించి ఏపీఐఐసీకి అప్పగించనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కోటవురట్ల మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అయిన వంగలపూడి అనిత, అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతోపాటు పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం లేదా పరవాడ మండలాల్లో కూడా మూడో దశలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటవుతాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 01:14 AM