ఎఫ్‌ఎఫ్‌సీ మోడల్‌లో ఎంఎస్‌ఎంఈలు పార్కులు
ABN , Publish Date - May 27 , 2026 | 12:45 AM
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) పార్కులు జిల్లాలో శరవేగంతో నిర్మితమవుతున్నాయి.
భీమిలి నియోజకవర్గం మినహా మిగిలిన సెగ్మెంట్లలో ‘కాంప్లెక్స్’ మోడల్‌లో నిర్మాణాలు
పెదగంట్యాడలో ఇప్పటికే రెడీ
ముడసర్లోవ, వెంకటాపురంలలో పూర్తి కావస్తున్న పనులు
కప్పరాడలో తాజాగా శంకుస్థాపన
‘సౌత్’లో పోర్టు స్థలం కోసం యత్నం
పద్మనాభం మండలం కృష్ణాపురంలో మాత్రం 23.68 ఎకరాల్లో 120 ప్లాట్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) పార్కులు జిల్లాలో శరవేగంతో నిర్మితమవుతున్నాయి. కొన్ని సిద్ధం కాగా, మరికొన్ని రెండు, మూడు నెలల్లో పూర్తి కానున్నాయి. వీటిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు, షాపులు కేటాయించి, రాయితీలు కూడా ఇవ్వనున్నారు.
విశాఖ జిల్లాలో పెందుర్తిని మినహాయిస్తే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈ పార్కులకు ఎకరాల్లో భూమి అవసరం కావడం, విశాఖ సిటీలో ఆ స్థాయిలో భూమి అందుబాటులో లేకపోవడంతో ‘ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్’ (ఎఫ్‌ఎఫ్‌సీ) మోడల్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు పారిశ్రామిక పార్కుల్లో ఎంతో కొంత భూమి కేటాయిస్తే అందులో పారిశ్రామికవేత్తలు నిర్మాణాలు చేసుకునేవారు. ఇప్పుడు భూమి కొరత ఉండడంతో ఎఫ్‌ఎఫ్‌సీ నమూనా ఎంచుకున్నారు. ఈ విధానంలో ఒకటి లేదా రెండు అంతస్థుల్లో ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టి షాపులను కేటాయిస్తుంది. అందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. జిల్లాలోని పెదగంట్యాడ (గాజువాక నియోజకవర్గం), కప్పరాడ (నార్త్ నియోజకవర్గం), ముడసర్లోవ (తూర్పు), వెంకటాపురం (విశాఖ పశ్చిమ)లో ఏర్పాటు చేస్తున్నవన్నీ ఈ తరహాలోనే నిర్మిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో భూమి అందుబాటులో ఉండడంతో పద్మనాభం మండలం కృష్ణాపురంలో ప్లాట్లే కేటాయిస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో విశాఖపట్నం పోర్టు నుంచి తీసుకొని అందులో ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఇవన్నీ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నాయి.
పెదగంట్యాడలో రెడీ
గాజువాక నియోజకవర్గంలోని పెదగంట్యాడలో 1.5 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మించారు. దీనికి రూ.8 కోట్లు వెచ్చించారు. అందులో యూనిట్లకు అవకాశం ఉంది. వాటిని ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
- విశాఖ తూర్పు నియోజకవర్గంలో ముడసర్లోవలో 2.18 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మాణం చకచకా జరుగుతోంది. దీనికి రూ.12 కోట్లు కేటాయించారు. సుమారు 27,600 చ.అ. విస్తీర్ణంలో భవనం వస్తుంది.
- పశ్చిమ నియోజకవర్గంలో వెంకటాపురంలో 1.45 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మాణం చేపట్టారు. దీనికి రూ.15.2 కోట్లు కేటాయించారు. ఈ పనుల్లో కొంత జాప్యం జరిగింది. కాంట్రాక్టర్ డిసెంబరు 2025 నాటికే పూర్తిచేస్తామని చెప్పినా చేయలేకపోయారు. రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు గడువు ఇచ్చారు. ఇక్కడ 23 యూనిట్లు పెట్టుకునే వెసులుబాటు ఉంది.
- విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కప్పరాడలో జిల్లా పరిశ్రమల కేంద్రం పక్కనే 80 సెంట్ల స్థలంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మాణానికి సోమవారమే శంకుస్థాపన చేశారు. దీనికి రూ.14.5 కోట్లు కేటాయించారు. రెండు అంతస్థుల్లో 30 యూనిట్లు నిర్మిస్తారు.
- భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని కృష్ణాపురంలో 23.68 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మించారు. దీనికి రూ.12.4 కోట్లు కేటాయించారు. అక్కడ ఒక్కొక్కటి 360 చ.మీ. విస్తీర్ణంలో 163 ప్లాట్లు వేశారు. సగం ప్లాట్లు కేటాయించారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు
ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో యూనిట్లు పెట్టేవారికి ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తుంది. విద్యుత్‌కు యూనిట్‌కు 75 పైసలు చొప్పున ఐదేళ్లు రాయితీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే వ్యాట్, ఎస్‌జీఎస్‌టీలను ఐదేళ్ల వరకు 100 శాతం రీయింబర్స్‌మెంట్ చేసుకోవచ్చు. పెట్టుబడి రాయితీ కింద రూ.20 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. అదే మహిళలకు అయితే రాయితీ మరింత ఎక్కువ వస్తుంది.