Share News

21 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

ABN , Publish Date - Oct 17 , 2026 | 01:41 AM

గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

21 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ

వచ్చే నెల మూడో తేదీన ఎన్నికలు

నాలుగు మండలాల్లో 203 పోలింగ్‌ కేంద్రాలు

జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల మూడో తేదీన ఎన్నికలు జరుగుతాయని జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 203 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి నోడల్‌ అధికారులను నియమించామని, డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలను ఇన్‌చార్జిలుగా ఉంటారని, అసిస్టెంట్‌ అథారిటీగా ఎంపీడీవోలు వ్యవహరిస్తారని అన్నారు. ప్రతిపోలింగ్‌ కేంద్రంలో కనీస వసతులు ఉండేలా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఫొటోలతో ఉండే ఫ్లెక్సీలు తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు. ఎన్నికల పనులన్నింటినీ ఇచ్చిన గడువులోగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో విశాఖ ఆర్డీవో ఎస్‌.దిలీప్‌చక్రవర్తి, జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో సందీప్‌, డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌, స్వర్ణ వార్డు, స్వర్ణగ్రామ జిల్లా అధికారి ఆర్‌.పూర్ణిమాదేవి పాల్గొన్నారు.


అభ్యర్థుల ఉరుకులు, పరుగులు

కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం తహశీల్దారు కార్యాలయాలకు...

నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ కోసం జీవీఎంసీ జోనల్‌ కార్యాలయాలకు...

ప్రత్యేక ఏర్పాటుచేసిన అధికారులు

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. గడువులోగా నామినేషన్‌తో పాటు జత చేయాల్సిన సర్టిఫికెట్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్‌ కోటాలో సీటు పొందాలంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తహశీల్దార్‌ కార్యాలయం జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. అదేవిధంగా జీవీఎంసీకి ఆస్తి పన్ను, మంచినీటి కుళాయి పన్ను, సంస్థకు చెందిన ఏదైనా దుకాణం అద్దెకు తీసుకుని ఉంటే వాటికి సంబంధించిన మొత్తాలు అన్నీ ఇప్పటివరకూ ఎటువంటి బకాయి లేకుండా చెల్లించి ఉండాలి. వీటికి సంబంధించి జీవీఎంసీ జోనల్‌ కార్యాలయాల్లో ‘నో డ్యూస్‌’ సర్టిఫికెట్‌ ఇస్తారు. వాటి కోసం పోటీదారులు జోనల్‌ కార్యాలయాలకు వెళుతున్నారు. బకాయిలు ఏమున్నాయో చూసి వాటిని కట్టేస్తున్నారు. అలాంటి వారికి వెంటనే నో డ్యూ సర్టిఫికెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అలాగే మండల తహశీల్దార్‌ కార్యాలయాల్లో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి ప్రత్యేకమైన సెల్‌ ఏర్పాటుచేశారు. వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు అందరినీ అక్కడే ఉండాలని ఆదేశించారు. మీ సేవ, సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే తహశీల్దార్‌ సంతకం చేయించి వెనక్కి పంపుతున్నారు. ఎవరైనా అభ్యర్థులు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకున్నా పరిశీలించి పని చేసి పెడుతున్నారు. అయితే భర్తకు బదులు భార్యకు కుల ధ్రువీకరణ ఇవ్వాలంటే పదో తరగతి సర్టిఫికెట్‌ తీసుకురావాలని కొన్ని కార్యాలయాల్లో కోరుతున్నారు. అది లేకపోతే సర్టిఫికెట్‌ జారీ చేయలేమని చెబుతున్నారు. గాజువాక తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఇలాగే పలువురిని వెనక్కి పంపించారు. ప్రత్యేక సెల్‌ ఏర్పాటుచేసి ఒక్క శుక్రవారమే విశాఖ అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో 29, మహారాణిపేటలో 42 సర్టిఫికెట్లు మంజూరు చేశారు. జీవీఎంసీలో మొత్తం 120 వార్డులు ఉన్నాయి. కూటమి తరఫున 120 మంది, వైసీపీ తరఫున మరో 120 మంది, వామపక్షాలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కలిసి మొత్తం 500 మందికి పైగానే నామినేషన్లు వేసే అవకాశం ఉంది. వారందరికీ ఈ రెండు రోజుల్లోనే కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. ఆయా కార్యాలయాల్లో జాప్యం వల్ల నామినేషన్‌ వేయలేకపోయామని ఎవరూ ఆరోపించకుండా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేసి వెంట వెంటనే ఇస్తున్నారు.


పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు

నాలుగు మండలాల్లో మొత్తం 79 పంచాయతీలు

బీసీలకు 33, ఎస్సీలకు 4, అన్‌రిజర్వుడ్‌/జనరల్‌...40

మొత్తంలో 39 సర్పంచ్‌ పదవులు మహిళలకు కేటాయింపు

802 వార్డుల్లో చెరిసగం

విశాఖపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి):

గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలోని నాలుగు మండలాల్లో 79 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 40 సర్పంచ్‌ పదవులను పురుషులకు, 39 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఆయా పంచాయతీల పరిధిలో 802 వార్డులు ఉండగా, 401 వార్డులను పురుషులకు, 401 వార్డులను మహిళలకు కేటాయించారు.

ఆనందపురం, పెందుర్తి, భీమునిపట్నం, పద్మనాభం మండలాల పరిధిలో ఉన్న 79 సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీ జనరల్‌కు 17, బీసీ మహిళకు 16 స్థానాలు కలిపి మొత్తం బీసీలకు 33 సర్పంచ్‌ స్థానాలను కేటాయించారు. అలాగే, ఎస్సీ జనరల్‌కు నాలుగు, ఎస్సీ మహిళకు రెండు కలిపి ఆరు స్థానాలను రిజర్వ్‌ చేశారు. అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 19 సర్పంచ్‌ స్థానాలను పురుషులకు, మరో 21 స్థానాలను మహిళకు కేటాయించారు. ఇక వార్డుల విషయానికి వస్తే బీసీలకు 317 (బీసీ జనరల్‌ 159, మహిళలకు 158) కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ జనరల్‌కు ఆరు స్థానాలకు కేటాయించారు. ఎస్సీలకు 66 (ఎస్సీ జనరల్‌ 50, మహిళలకు 16) వార్డులు రిజర్వ్‌ చేశారు. అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీకి 413 (జనరల్‌ 186, మహిళలకు 227 స్థానాలను) కేటాయించారు.

Updated Date - Oct 17 , 2026 | 01:41 AM