ఎంపీపీల ఎన్నిక ప్రశాంతం
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:04 AM
జిల్లాలో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 89, టీడీపీ 46, జనసేన 12, బీజేపీ 6, ఇతరులు 19 మంది గెలుపొందారు.
- మొత్తం 11 మండలాల్లో వైసీపీకి 6, కూటమికి 3, స్వతంత్ర 1
- డుంబ్రిగుడ మండలంలో కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా
- కోఆప్షన్ సభ్యుల ఎన్నికను వాయిదా వేసిన ఎన్నికల కమిషన్
- లాంఛనంగా జరిగిన వైస్ ఎంపీపీల ఎన్నిక
పాడేరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 89, టీడీపీ 46, జనసేన 12, బీజేపీ 6, ఇతరులు 19 మంది గెలుపొందారు.
కూటమికి అరకులోయ, కొయ్యూరు, జి.మాడుగులలో ఎక్కువ మంది ఎంపీటీసీ సభ్యులుండడంతో ఈ మూడు మండలాల్లో కూటమి ఎంపీపీ పీఠాలను దక్కించుకుంది. చింతపల్లి, పాడేరు, హుకుంపేట, అనంతగిరి, పెదబయలు మండలాల్లో వైసీపీ, జీకే వీధిలో స్వతంత్ర ఎంపీటీసీ.. ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకున్నారు. అయితే డుంబ్రిగుడ మండలంలో ఎవరికీ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు దక్కకపోవడంతో పాటు కోరం లేని కారణంగా ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. అలాగే అరకులోయ మినహా తొమ్మిది మండలాల్లో ఎంపీపీ ఎన్నిక అనంతరం లాంఛనంగా వైస్ ఎంపీపీల ఎన్నికలను నిర్వహించారు. అయితే అరకులోయలో సభ్యుల మధ్య సమన్వయ లోపంతో వైస్ ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.
డుంబ్రిగుడలో కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా
డుంబ్రిగుడ మండలంలో కోరం లేని కారణంగా ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ-3, వైసీపీ- 5, స్వతంత్రులు- 5, బీజేపీ- 1 స్థానం గెలుపొందాయి. ఎన్నికల సంఘం నిబంధన మేరకు మండలంలో ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే వారే ఎంపీపీ అవుతారు. కానీ వైసీపీ 5, కూటమి 4 స్థానాలకే పరిమితం కావడంతో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు స్వతంత్రుల మద్దతుకు ప్రయత్నాలు సాగించారు. ఇదే క్రమంలో ఐదుగురు స్వతంత్రులు కలిసి కూటమి లేదా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల మద్దతు పొంది ఎంపీపీ అవ్వాలని ప్రయత్నించారు. స్వతంత్రులు, కూటమి, వైసీపీ ఎవరికి వాళ్లు ప్రయత్నాలు చేసిన క్రమంలో ఎంపీపీ ఎన్నిక సమయానికి వైసీపీకి చెందిన 4, కూటమికి చెందిన 1, స్వతంత్రులు 3 మొత్తం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం లేని కారణంగా ఎంపీపీ ఎన్నికను రిటర్నింగ్ అధికారి రహీమ్ శుక్రవారానికి వాయిదా వేశారు.
కోఆప్షన్ సభ్యుల ఎన్నికల వాయిదా
ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక కంటే ముందే జరగాల్సిన కోఆప్షన్ సభ్యుల ఎన్నికలను అనివార్యకారణాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. లేకుంటే ఉదయం తొమ్మిది గంటలకు ఆయా మండలాల్లోని ఎంపీటీసీ సభ్యులంతా కోఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే అనుకోని విధంగా ఈ ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో దానిని మరో మారు నిర్వహిస్తారు.
ఎంపీడీవో కార్యాలయాల ముందు భారీగా బందోబస్తు
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 11 ఎంపీడీవో కార్యాలయాల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో అనుమతి ఉన్న అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ సభ్యులను మాత్రమే లోపలకు ప్రవేశం కల్పించారు. ఎంపీపీ ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయాలకు 200 మీటర్ల దూరంలో మాత్రమే ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.