Share News

పెదబయలు ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:38 PM

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై పెదబయలు ఎంపీడీవో ఎస్‌.డి.శ్యామ్‌సుందర్‌ను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు.

పెదబయలు ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌ సస్పెన్షన్‌
ఎస్‌.డి.శ్యామ్‌సుందర్‌

విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆగ్రహం

తక్షణమే సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని జడ్పీ సీఈవోకు ఆదేశం

పాడేరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై పెదబయలు ఎంపీడీవో ఎస్‌.డి.శ్యామ్‌సుందర్‌ను కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా అభివృద్ధి, తదితర అంశాలపై కలెక్టర్‌ మంగళవారం ఎంపీడీవోలు, డీప్యూటీ ఎంపీడీవోలకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అయితే పెదబయలు ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదు. దీంతో కలెక్టర్‌ ఆయనకు స్వయంగా కాల్‌ చేస్తే, తాను ఆస్పత్రిలో ఉన్నానని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఆయన ఆస్పత్రిలో లేకపోగా మద్యం మత్తులో ఉన్నట్టు కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో ఆగ్రహించిన కలెక్టర్‌ ఆయనను తక్షణమే సస్పెండ్‌ చేసి, ఏవోగా పని చేస్తున్న పూర్ణయ్యకు ఎంపీడీవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా పరిషత్‌ సీఈవో నారాయణమూర్తిని కలెక్టర్‌ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసే ఎవరైనా శాఖాపరమైన చర్యలు ఎదుర్కొక తప్పదని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఈ సందర్భంగా ఘాటుగా హెచ్చరించారు.

Updated Date - Feb 03 , 2026 | 11:38 PM